అమరావతి : 150లో జనసేన షేరెంత ? పేలుతున్న సెటైర్లు
జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు చెప్పిన మాట ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల జనసేన నేతలతో నాగబాబు మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో వైసీపీని జనాలు చిత్తుచిత్తుగా ఓడించటం ఖాయమన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, వైసీపీని ఎప్పుడు ఓడిద్దామా అని జనాలు ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. టీడీపీ-జనసేన కూటమి వచ్చేఎన్నికల్లో గెలవటం చాలా అవసరమన్నారు. నీతి, నిజాయితీతో కూడిన పాలన అంటే ఎలాగుంటుందో మరో మూడు నెలల తర్వాత జనాలు చూస్తారని నాగబాబు చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో రెండుపార్టీలకు 150 సీట్లు రావటం ఖాయమని జోస్యం కూడా చెప్పారు. వైసీపీకి 25 సీట్లు వస్తే చాలా ఎక్కువన్నారు. వైనాట్ 175 అంటున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ 25 సీట్లు గెలుచుకుంటే అదే చాలా ఎక్కువని ఎద్దేవా చేశారు. ఇపుడు ఇదే విషయమై నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. రెండుపార్టీల కూటమి గెలుచుకోబోయే 150 సీట్లలో జనసేన ఎన్నిసీట్లు గెలుచుకుంటుందో చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
రెండుపార్టీలు కలిపి 150 నియోజకవర్గాల్లో గెలుస్తుందని జోస్యం చెప్పిన నాగబాబు మరి జనసేన ఎన్ని నియోకవర్గాల్లో గెలుస్తుందో చెప్పలేరా ? అని అడుగుతున్నారు. గెలవబోయే సీట్లపై జోస్యం చెప్పేముందు అసలు జనసేన ఎన్నిసీట్లలో పోటీచేస్తుందో చెప్పాలని ఎగతాళి చేస్తున్నారు. జనసేన ఎన్నిసీట్లలో పోటీచేస్తుందో తెలీదు, పోటీచేసే సీట్లలో ఎన్నింటిలో గెలుస్తుందో తెలీదు, అసలు చంద్రబాబునాయుడు ఎన్నిసీట్లిస్తారో కూడా తెలీదు కానీ రెండుపార్టీలు కలిపి 150 సీట్లలో గెలుస్తాయని మాత్రం చెప్పేశారు అంటు నాగబాబును ఓ ఆటాడుకుంటున్నారు.
ఈ సెటైర్లకు కారణం ఏమిటంటే మొన్నటి తెలంగాణా ఎన్నికలే అని చెప్పాలి. 32 నియోజకవర్గాల్లో పోటీచేస్తున్నట్లు ప్రకటించిన పవన్ చివరకు పోటీచేసింది 8 సీట్లలో. ఇందులో కూడా కూకట్ పల్లి నియోజకవర్గంలో మాత్రమే 20 వేల ఓట్లు తెచ్చుకుని పరువు నిలుపుకున్నది. మిగిలిన ఏడు సీట్లలో డిపాజిట్లు కూడా రాలేదు. సేమ్ సీన్ ఏపీలో కూడా రిపీట్ కాకుండా చూసుకోమని నెటిజన్లు నాగబాబుకు హతవు చెబుతున్నారు.