అమరావతి : ‘నిజం గెలవాలి’ అంటే అర్ధమిదేనా ?
రాష్ట్ర రాజకీయాల్లో ఇపుడొక విచిత్రమైన పరిస్ధితి కనబడుతోంది. నిజం గెలవాలి అని భువనేశ్వరి చేస్తున్న బస్సుయాత్ర విషయంపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. విషయం ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళు నిజం గెలవాలని మాత్రమే కోరుకుంటారు. ఇందులో రెండో ఆలోచనకు తావులేదు. ఇదే విధంగా భువనేశ్వరి యాత్ర నేపధ్యంలో కూడా జనాలందరు నిజం గెలవాలనే కోరుకుంటున్నారు. జనాలందరు భువనేశ్వరి విషయంలో నిజం గెలవాలనే స్లోగన్ కు మాత్రమే మద్దతుగా మాట్లాడుతున్నారు.
అయితే ఇక్కడే చిన్న ట్విస్టుంది. అదేమిటంటే నిజం గెలవాలి అంటే ఏమిటి ? స్కిల్ స్కామ్ లో తన భర్తను అక్రమంగా అరెస్టుచేసి జైలులో పెట్టారన్నది భువనేశ్వరి వాదన. ఈ నేపధ్యంలోనే నిజం గెలవాలనే నినాదంతో బస్సుయాత్ర మొదలుపెట్టారు. ఇక్కడే జనాలందరిలోను ఒక అనుమానం పెరిగిపోతోంది. అదేమిటంటే నిజం గెలవాలంటే ఏమిటి ? భువనేశ్వరి అనుకుంటున్న నిజమా ? లేకపోతే అసలు స్కామ్ జరిగిందా లేదా ? జరిగితే అందులో చంద్రబాబు పాత్ర ఏమిటి ? అనే నిజమా ?
భువనేశ్వరి అనుకుంటున్న నిజమే అయితే అది ఎప్పటికీ జరిగే పనికాదు. ఎందుకంటే భువనేశ్వరి అనుకుంటున్న నిజానికి జనాల మద్దతు ఎప్పటికీ దొరకదు. స్కామ్ లో నిజంగా జరిగింది ఏమిటి అనే నిజానికే జనాలు ఓట్లేస్తారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే మంత్రులు, వైసీపీ నేతలు కూడా భువనేశ్వరి స్లోగన్ నిజం గెలవాలి అనే చెబుతున్నారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు అరెస్టయ్యారని, నిజం గెలవాలంటే చంద్రబాబు పూర్తిగా జైలులోనే ఉండాలని సెటైర్లు వేస్తున్నారు.
చంద్రబాబు మీదున్న కేసులను కొట్టేసి, విచారణను నిలిపేసి వెంటనే జైలు నుండి విడుదల చేస్తేనే నిజం గెలిచినట్లు భువనేశ్వరి అనుకుంటున్నారు. ఇదే జరిగితే ఇక చట్టాలెందుకు, దర్యాప్తు సంస్ధలు, విచారణ దేనికి ? కోర్టులున్నది ఎందుకు ? మొత్తానికి భువనేశ్వరి స్లోగన్ నిజం గెలవాలిలోనే పూర్తి కన్ఫ్యూజన్ ఉన్నది. నిజం గెలవాలిలో భువనేశ్వరి అనుకుంటున్న నిజం గెలుస్తుందా ? మంత్రులు చెబుతున్న నిజం గెలుస్తుందా ? లేకపోతే జనాలు ఎదురుచూస్తున్న నిజం గెలుస్తుందా ? అన్నది ఆసక్తిగా మారింది.