అమరావతి : వాలంటీర్లపై పవన్ కు చంద్రబాబు షాక్ ?
వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట మార్చారు. వారాహియాత్ర ఏలూరు సభలో మాట్లాడుతు రాష్ట్రంలో జరుగుతున్న హ్యూమన్ ట్రాఫికింగ్ కు వాలంటీర్లే కారణమని ఆరోపించిన విషయం తెలిసిందే. వాలంటీర్లు అసాంఘీక శక్తులుగా మారిపోయారని పదేపదే ఆరోపించారు. దాంతో 2.5 లక్షల మంది వాలంటీర్లు నిరసనగా రోడ్డెక్కారు. గడచిన నాలుగురోజులుగా పవన్ దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు. పోస్టర్లకు చెప్పుల దండలు వేసి కొడుతున్నారు. మరికొన్నిచోట్ల పోస్టర్లను తగలబెట్టారు.
తమపై నిరాధార ఆరోపణలు చేసినందుకు పవన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీతో పాటు మహిళా కమీషన్ కు ఫిర్యాదుచేశారు. నాలుగురోజులైనా వాళ్ళ ఆందోళనలు తగ్గలేదు. ఇదే సమయంలో ప్రతిపక్షాల్లో ఏ ఒక్కపార్టీ నుండి పవన్ కు మద్దతు దొరకలేదు. ఇంతేకాకుండా జనసేన నేతలు కూడా పవన్ ఆరోపణలను సమర్ధించుకోలేక డిబేట్లలో నానా అవస్తలు పడుతున్నారు. ప్రజల్లో సానుకూలంగా ఉన్న వాలంటీర్ల వ్యవస్ధపై పవన్ పెద్ద ఆరోపణ చేయటాన్ని ఎవరు సమర్ధించటంలేదు.
దాంతో తప్పనిస్ధితిలో మాట మార్చారు. వాలంటీర్లు తనకు సోదర, సోదరీమణులతో సమానమన్నారు. తాను అన్న మాటలు వాలంటీర్లందరికీ వర్తించవనిచెప్పారు. అంటే కొందరిని మాత్రమే ఉద్దేశించి అన్నదే నిజమైతే ఆ కొందరు ఎవరు ? ఎప్పుడు అమ్మాయిల బ్రోకర్లుగా వ్యవహరించారో చెప్పాలి కదా. నిజానికి పవన్ కు అమ్మాయిల మిస్సింగుకు, హ్యూమన్ ట్రాఫికింగుకు తేడానే తెలీదు. ఎవరో స్క్రిప్ట్ అందిస్తే నోటికొచ్చినట్లు ఆరోపించేశారంతే.
ఇదే విషయమై చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడుతు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్ధ కంటిన్యు అవుతుందన్నారు. వాలంటీర్ల వ్యవస్ధా ఉంటుంది, వాలంటీర్లూ కంటిన్యు అవుతారని స్పష్టంగా ప్రకటించారు. పవనేమో వాలంటీర్ల వ్యవస్ధ నడుం విరగొడతామని, వ్యవస్ధరద్దుకు కోర్టులో పోరాడుతామని ప్రకటించారు. చంద్రబాబేమో వాలంటీర్ల వ్యవస్ధ కంటిన్యు అవుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇద్దరు పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఇద్దరిలోనే ఒక వ్యవస్ధ విషయంలో ఎంత విరుద్ధ ఆలోచనలున్నాయో అర్ధమవుతోంది.
వాలంటీర్లను వ్యతిరేకం చేసుకుంటే ఏమవుతుందో చంద్రబాబుకు బాగా తెలుసు. అయితే పోయేదేమీ లేదు కాబట్టి పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడారు. వాలంటీర్ల వ్యవస్ధకు మద్దతుగా ఇపుడు మాట్లాడిన చంద్రబాబు రేపు ఇదే మాటమీద ఉంటారని కూడా అనుకునేందుకు లేదు. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.