అమరావతి : పవన్లో రెండో ఆలోచన మొదలైందా ?
జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు మాటలు వింటుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. నాగబాబు ఈమధ్య ఎక్కడ పర్యటించినా, ఎవరితో మాట్లాడినా రెగ్యులర్ గా ఒకమాట చెబుతున్నారు. అదేమిటంటే రాబోయేది జనసేన ప్రభుత్వమే, ముఖ్యమంత్రి పవన్ కల్యాణే అని. ఒకవైపు తమ్ముడు, పార్టీ అధినేత పవన్ కే అధికారంపై నమ్మకం లేదు. అసలు ఒంటరిపోటీకే ధైర్యం సరిపోవటంలేదు. అలాంటిది జనసేన ప్రభుత్వమట, పవన్ ముఖ్యమంత్రట.
పవన్ ముఖ్యమంత్రి అయిపోగానే తిరుమల తిరుపతి దేవస్ధానాన్ని ప్రక్షాళన చేసేస్తారట, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలును సమూలంగా మార్చేస్తారట. అసలు పవన్ నేతృత్వంలో ఏపీ రూపురేఖలే మారిపోతాయని నాగబాబు బల్లగుద్దకుండానే గట్టిగా చెబుతున్నారు. తాజాగా యలమంచిలి నియోజకవర్గంలో పార్టీ ఆఫీసును ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతు పార్టీ ఓటుబ్యాంకు 35 శాతం అని ప్రకటించారు.
2019 ఎన్నికల్లో 7 శాతం వచ్చిన ఓట్లు ఇపుడు 35 శాతానికి పెరిగినట్లు చెప్పారు. పార్టీకి 35 శాతం ఓటుబ్యాంకు ఉన్నట్లు నాగబాబు ఎలా చెప్పగలిగారో అర్ధంకావటంలేదు. రాబోయే ఎన్నికల్లో జనసేన తరపున ఎవరు పోటీచేసినా అందరినీ గెలిపించాల్సిన బాధ్యత నేతలు, వీరమహిళలు, జనసైనికులపైన ఉందని గట్టిగా చెప్పారు. అంతాబాగానే ఉందికానీ రాబోయేది జనసేన ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా పవన్ అన్నదే అర్ధంకావటంలేదు. 35 శాతం ఓటుబ్యాంకు అన్న విషయాన్ని చూసుకుని పొత్తు విషయంలో పవన్ ఏమన్నా రెండో ఆలోచన చేస్తున్నారా అన్న అనుమానం పెరిగిపోతోంది.
నిజానికి ఇలాంటి ఆలోచనే అటు చంద్రబాబునాయుడులో కూడా ఉందనే ప్రచారం అందరికీ తెలిసిందే. మూడు ఎంఎల్సీ స్ధానాల గెలుపుతో జనాలంతా టీడీపీకి ఓట్లేయటానికి రెడీగా ఉన్నారనే నమ్మకం చంద్రబాబులో పెరిగిపోయిందr. అందుకనే తమ్ముళ్ళు కూడా ఒంటరిగానే పోటీచేద్దామని చెప్పిన విషయాలను ఓప్పిగ్గా వింటున్నారట. జనసేనకు 35 శాతం ఓట్లున్నాయన్నది నిజమే అయితే ఎవరితోను పొత్తు పెట్టుకోవాల్సిన అవసరమే లేదన్నది వాస్తవం. అందుకనే రాబోయే ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీచేస్తే ఎలాగుంటుందనే ఆలోచన పవన్లో కూడా మొదలైందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పవన్ అనుమతి లేకుండానే జనసేన ప్రభుత్వం, పవనే ముఖ్యమంత్రని నాగబాబు పదేపదే చెప్పగలరా ?