అమరావతి : చిరంజీవిలో ఇంత వైరాగ్యమా ? పవనే కారణమా ?
ఒక చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేమిటంటే ఏపీ రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధంలేదని. తాను నూరుశాతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. ఏపీ రాజకీయాల గురించి తెలుసుకోవాలనే కుతూహలం కూడా తనకు లేదని స్పష్టంగా ప్రకటించేశారు. ఇపుడీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. ఒక్కసారిగా చిరంజీవిలో ఇంతటి వైరాగ్యం ఎందుకు వచ్చేసింది ?
కొద్దిరోజుల క్రితమే ఏదో ఫంక్షన్లో మాట్లాడుతు అవసరమైనపుడు తన తమ్ముడికి మద్దతుగా నిలబడతానని ఇదే చిరంజీవి ప్రకటించారు. తన తమ్ముడు రాజకీయాల్లో అత్యున్నత స్ధాయికి చేరుకుంటాడన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తంచేశారు. మరీ గ్యాపులో ఏమైపోయిందని మెగాస్టార్ వైరాగ్యంలోకి వెళిపోయారు. ఏపీ రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధంలేదని చెప్పేశారంటే అర్ధమేంటి ? ఏపీ రాజకీయాలతో సంబంధంలేదన్నారంటే జనసేనను కూడా పట్టించుకోను అని చెప్పినట్లే అర్ధమొస్తోంది.
తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు చాలామంది మెగా అభిమానులు రాబోయే ఎన్నికల్లో చిరంజీవి కీలకపాత్ర పోషిస్తాడని ఎదురు చూస్తున్నట్లున్నారు. ఇంతలోనే ఎవరూ ఊహించని రీతిలో పెద్దబండ పడేశారు. దీనికి కారణం ఏమయ్యుంటుంది ? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమైతే పవన్ వైఖరితో చిరంజీవి విసిగిపోయినట్లుగా ఉందట. స్వతంత్రంగా రాజకీయాలు చేయకుండా తమ్ముడు వెళ్ళి చంద్రబాబునాయుడు చంకలో ఎక్కి కూర్చోవటం మెగాస్టార్ కు నచ్చలేదేమో అని అనుమానాలు పెరిగిపోతున్నాయి. టీడీపీతో తమ్ముడు పొత్తు పెట్టుకోవటం చిరంజీవికి ఇష్టంలేదనే ప్రచారం పెరిగిపోతోంది.
చాలా చోట్ల కమ్మ-కాపుల మధ్య ఏమాత్రం పడదన్న విషయం చిరంజీవికి బాగా తెలుసు. పవన్ చంద్రబాబుతో కలవాలని చేస్తున్న ప్రయత్నాలు కాపుల్లోనే బలమైన సెక్షన్ కు ఏమాత్రం నచ్చటంలేదు. చంద్రబాబుకు ఎంత దగ్గరైతే పవన్ అంత నష్టపోతారనే భావన చిరంజీవిలో ఉందని సమాచారం. ఇలాంటి అనేక కారణాలతోనే చిరంజీవి తమ్ముడి రాజకీయానికి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు ప్రచారం మొదలైంది. ఇందులో నుండి వచ్చిందే తాజా వైరాగ్యపు మాటలని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందనేది మళ్ళీ నెక్స్ట్ ప్రకటన వచ్చేంతవరకు వెయిట్ చేసి చూడాల్సిందే.