అమరావతి : ప్రతిపక్షాలపై డైరెక్ట్ ఎటాకేనా ?

Vijaya


ఎన్నికల హీట్ పెరిగిపోతున్న నేపధ్యంలో జగన్మోహన్ రెడ్డి తన దూకుడుతో ప్రతిపక్షాలను ఇరుకునపడేసినట్లే ఉన్నారు. నవరత్నాల అమలులో భాగంగా సంక్షేమఫలాలు అందాయని అనుకుంటేనే వచ్చే ఎన్నికల్లో తమకు ఓట్లేయమని సుత్తిలేకుండా సూటిగా అడుగుతున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అన్నీ రాజకీయపార్టీల అధినేతలు వరస పర్యటనలతో రాజకీయ హీటు పెంచేస్తున్నారు. ఏదో రూపంలో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ జనాల్లోకి వెళుతున్నారు.



చంద్రబాబు రెగ్యులర్ గా పర్యటనలు చేస్తున్నా పవన్ సినిమా షూటింగుల్లో గ్యాప్ వచ్చినపుడు జనాలను కలుస్తున్నారు. ఇదే సమయంలో జగన్ ప్రతినెలా మూడు, నాలుగు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. గడచిన మూడున్నరేళ్ళల్లో తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. అభివృద్ధి కూడా ఇపుడిప్పుడు ఊపందుకుంటోంది. ఇదే విషయాన్ని జగన్ ప్రజలకు అర్ధమయ్యేట్లు వివరిస్తున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నది లేనిది చెక్ చేసుకునేందుకే జగన్ వ్యూహాత్మకంగా గడపగడపకు వైసీపీ ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.



ఇక్కడే ప్రతిపక్షాలు బాగా ఇబ్బందులు పడుతున్నాయి. జగన్ అమలు చేస్తున్న నవరత్నాలను  ప్రతిపక్షాలు కౌంటర్ చేయలేకపోతున్నాయి. ఎందుకంటే సంక్షేమపథకాలను అమలుచేయటం ద్వారా జగన్ ఏపీని శ్రీలంక లాగ చేసేస్తున్నట్లు చంద్రబాబు, పవన్ ఎంత గోల చేసింది అందరికీ తెలిసిందే. అంటే రాష్ట్రంలో జగన్ సంక్షేమపథకాలను అమలుచేస్తున్నట్లు స్వయంగా చంద్రబాబు, పవనే అంగీకరించినట్లయ్యింది. దీన్ని బేస్ చేసుకునే ప్రతిపక్షాలపైన జగన్ డైరెక్ట్ ఎటాక్ చేస్తున్నారు.




వాళ్ళు చేసిన ఆరోపణలనే ఇపుడు జగన్ ఆయుధంగా మార్చుకున్నారు. పార్టీ రహితంగా సంక్షేమ పథకాలు అర్హుల్లో చాలామందికి అందుతున్నాయి. గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలకు అందుతున్న పథకాల వివరాలు కూడా బయటపడుతున్నాయి. కాబట్టి సంక్షేమపథకాలు అమలుకావటంలేదని, అందటంలేదని ప్రతిపక్షాలు అనలేకపోతున్నాయి. అందుకనే చంద్రబాబు, పవన్ రూటుమార్చి తాము అధికారంలోకి వస్తే ఇప్పటికన్నా ఎక్కువ సంక్షేమపథకాలను అందిస్తామని చెబుతున్నారు. దీంతోనే జగన్ సంక్షేమపథకాలను అందరికీ అందిస్తున్నట్లు నిర్ధారణయ్యింది. ఇందుకనే సంక్షేమపథకాలు అందితేనే ఓట్లేయమని జగన్ డైరెక్టుగా అడుగుతున్నారు. ఇక్కడే జగన్ అప్పీలను ఎలా కౌంటర్ చేయాలో ప్రతిపక్షాలకు  అర్ధంకావటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: