గోదావరి : వైసీపీ నేతలు జనసేన వైపు చూస్తున్నారా ?
వినటానికే విచిత్రంగా ఉంది. ఒకపట్టాన నమ్మేట్లుగా లేదుకానీ జరుగుతున్నది ఇదే. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గం వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావు తొందరలో జనసేనలో చేరటానికి ముహూర్తం చూసుకుంటున్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కలిసి చర్చలు జరిపారంటే విషయం ఏముంటుంది ? వచ్చే ఎన్నికల్లో రాజోలులో జనసేన తరపున అభ్యర్ధిగా తనకు టికెట్ ఇచ్చేపక్షంలో వెంటనే జనసేనలో చేరుతానని బొంతు చెప్పుంటారనటంలో సందేహంలేదు.
ఎందుకంటే వైసీపీ తరపున వచ్చే ఎన్నికల్లో బొంతుకు టికెట్ దక్కే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. 2014, 19 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయిన బొంత మళ్ళీ మూడోసారి కూడా టికెట్ కోరుకుంటున్నారు. ఈయన కోరికకు జనసేన తరపున గెలిచిన రాపాక వరప్రసాద్ అడ్డుపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రాపాకకే టికెట్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఖాయం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే వైసీపీలోనే ఉంటే తనకు టికెట్ రాదని నిర్ణయించుకున్నారట. అందుకనే పవన్ తో మాట్లాడించుకుని ముందు హామీ తీసుకున్న తర్వాతే నేరుగా భేటీఅయ్యారు.
ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే రేపటి ఎన్నికల్లో టికెట్లు రావని డిసైడ్ చేసుకున్నవారిలో కొందరైనా జనసేనలో చేరిపోయే అవకాశాలున్నాయి. ఎందుకంటే టీడీపీలో ఇప్పటికే నియోజకవర్గాల స్ధాయిలో మాజీలో లేదా సీనియర్లో ఉన్నారు. కాబట్టి టీడీపీలో పోటీకి అవకాశాలు బాగా తక్కువ. అదే జనసేన అయితే టికెట్ దక్కే అవకాశాలున్నాయి. ఎందుకంటే జనసేనలో చాలా నియోజకవర్గాల్లో అసలు పోటీచేసేంత సీనున్న నేతలే లేరు.
బొంతు లాంటి నేతలు పార్టీలో చేరటం జనసేనకు చాలా అవసరమని పవన్ కు బాగా తెలుసు. అందుకనే వచ్చిన వాళ్ళకు వచ్చినట్లు టికెట్లు ఖాయంచేసే అవకాశముంది. జనసేనలోకి వెళితే టికెట్ ఖాయమని అనుకుంటే వైసీపీలోని ద్వితీయస్ధాయి నేతల్లో కొందరైనా జనసేనలో చేరే అవకాశాలున్నాయి. ఈ రకంగా అయినా జనసేన కొన్ని నియోజకవర్గాల్లో అయినా బలంగా కనబడుతుందేమో. మొత్తానికి వైసీపీ నేతల్లో కొందరికి జనసేన ఫ్టస్ ఆప్షన్ గా మారబోతున్నట్లు అర్ధమవుతోంది.