కేసీఆర్ కి బిగ్ షాక్.. దర్బార్ కొనసాగిస్తానన్న గవర్నర్..
ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు తెలంగాణ గవర్నర్ తమిళి సై. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ ప్రవర్తన మారాలని, రాజ్ భవన్ నే వారు గౌరవించడం లేదని, ఇక సామాన్యుల పరిస్థితేంటి? అని ప్రశ్నించారు. తెలంగామలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని చెప్పారు గవర్నర్ తమిళి సై. జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటనపై ప్రభుత్వాన్ని తాను నివేదిక అడిగానని, కానీ ఇప్పటి వరకూ వారు ఆ నివేదిక ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. ఆ విషయంలో ప్రభుత్వానికి బాధ్యత లేదా? అని ప్రశ్నించారామె.
రాజ్ భవన్ నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఓ సందేశం ఇచ్చేందుకు ఈ దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రయత్నిస్తున్నానని చెప్పారు గవర్నర్ తమిళిసై. సీఎం కేసీఆర్ ని ముఖాముఖి కలిసి ఏడాది దాటిందని, తనను ఆయన కలవకపోయినా, తన సందేశం వారి వరకు చేరితే చాలు అని అన్నారామె. ఇక యూనివర్శిటీల వైస్ ఛాన్స్ లర్లకు ఇన్ చార్జ్ గా, ఛాన్స్ లర్ గా ఉన్న గవర్నర్ అధికారాలకు కత్తెర వేయాలని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆలోచనపై కూడా తమిళి సై స్పందించారు. అది ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారామె. రాజ్ భవన్ లో ప్రజా దర్బార్ అనేది నిరంతర కార్యక్రమం అని స్పష్టం చేశారు. మహిళా దర్బార్ నిర్వహించడం వెనక ఎలాంటి రాజకీయ కారణం లేదన్నారు. తన పరిధి తానెప్పుడూ దాటలేదని స్పష్టం చేశారు తమిళి సై. తెలంగాణలో మహిళల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేస్తానని చెప్పారు తమిళి సై. భవిష్యత్తులో కూడా ప్రజా దర్బార్, మహిళా దర్బార్ కార్యక్రమాలను కొనసాగిస్తానని అన్నారు. మహిళా దర్బార్ నిర్వహణతో ఒకరకంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆమె కౌంటర్ ఇచ్చినట్టు అర్థమవుతోంది.