అమరావతి : వీళ్ళవల్ల జగన్ కు డ్యామేజి తప్పదా ?

Vijaya



ఊరుకున్నంత ఉత్తమం ఇంకోటిలేదు అనేది సామెత. ఊరకే ఉండే అవకాశం లేనపుడు కనీసం ఎంత తక్కువగా మాట్లాడితే అంత సేఫ్. ఈ విషయాలు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కొందరి తెలిసినట్లు లేదు. అందుకనే నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. కొందరు మంత్రులు మాట్లాడుతున్న మాటల వల్ల ప్రతిపక్షాలకన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జరగబోయే డ్యామేజీయే ఎక్కువన్నట్లుంది.





తాజాగా హోంశాఖ మంత్రి తానేటి వనిత వ్యాఖ్యలనే తీసుకుందాం. ఏదో కార్యక్రమంలో పాల్గొన్న వనిత రేపల్లె రైల్వేస్టేషన్లో జరిగిన అత్యాచారంపై మాట్లాడారు. నిజానికి ఇపుడు వనిత ఏమీ మాట్లాడకపోయినా నష్టంలేదు. కానీ ఏదో మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడి ప్రభుత్వాన్ని బాగా డ్యామేజిచేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే అత్యాచారం చేసిన వాళ్ళు చేయాలని చేయలేదట. డబ్బుల కోసం భర్తపై దాడిచేశారట. భర్తపై జరిగిన దాడిని అడ్డుకున్నందుకు వస్తే భార్యపైన అప్పటికప్పుడు అత్యాచారం చేశారట.





నిందుతులు తాగేసుండటం కూడా అత్యాచారం జరగటానికి కారణంగా చెప్పారు. కొన్నిసార్లు అత్యాచారాలు అలా జరుగుతుంటాయని కూడా అన్నారు. ఇక్కడ అత్యాచారం జరిగిందా లేదా అన్నది పాయింట్. అత్యాచారం చేసిన వాళ్ళు ఎందుకు చేశారు అన్నది అనవసరం. కానీ స్వయంగా హోంశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు నిందుతులకు మద్దతుగా ఉన్నట్లుంది. ఆమె ఉద్దేశ్యం అదికాకపోయినా మీడియాలో క్యారీ అయ్యిందదే. ఈ వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి ఎంతటి డ్యామేజీ జరిగిందో వనిత ఆలోచించినట్లు లేదు.





అలాగే మరో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతు జగన్ను ఆరాధిస్తే జర్నలిస్టులకు ఇళ్ళస్ధలాలు వస్తాయన్నారు. జగన్ను జర్నలిస్టులు ఆరాధించటం ఏమిటో మంత్రికే తెలియాలి. ఇంకో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతు పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ విషయంలో మాట్లాడుతు వేరే ప్రాజెక్టుల డయాఫ్రం వాల్ గురించి మాట్లాడారు. అసలు ఏఏ ప్రాజెక్టుల్లో డయాఫ్రం వాల్ కడతారో కూడా మంత్రికి తెలీదని బయటపడింది. నిజానికి అందరికీ ఇలాంటి విషయాలు తెలియాలని ఏమీలేదు. కానీ మంత్రిగా మాట్లాడేటపుడు తెలుసుకుని మాట్లాడాలి. ఇలా మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే జగన్ ప్రభుత్వానికి డ్యామేజీ పెరుగటం ఖాయం. వీళ్ళని కంట్రోల్ చేయకపోతే అంతే సంగతులు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: