అమరావతి : మూడు సామాజికవర్గాలను త్యాగం చేశారా ?
వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి బీసీల కోసమని మూడు సామాజికవర్గాలను త్యాగం చేయటానికి వెనకాడలేదు. బీసీలకు పెద్ద పీట వేయాలనే వ్యూహంలో భాగంగా క్షత్రియ, వైశ్య, కమ్మ సామాజికవర్గాలకు కోత పెట్టారు. రాజీనామా చేసిన మంత్రుల్లో క్షత్రియ, వైశ్య సామాజికవర్గాల నుండి చెరుకువాడ కొడాలి నాని, శ్రీరంగనాధరాజు, వెల్లంపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. అయితే కొత్తగా ఏర్పాటవబోయే మంత్రుల్లో పై రెండు సామాజికవర్గాల నుండి ప్రాతినిధ్యం లేదు.
ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే బీసీలకు ప్రాధాన్యత పెంచటమే. ఇంతకుముందు బీసీలు ఏడుగురుండేవారు. కొత్త మంత్రివర్గంలో బీసీల సంఖ్య 10కి పెరిగింది. ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, బొత్సా సత్యనారాయణ, పూడి ముత్యాలనాయుడు, చెన్నుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, విడదల రజని, గుమ్మనూరి జయరాం, ఉషశ్రీచరణ్ పేర్లు దాదాపు ఖరారయ్యాయి.
వీరిలో కూడా జయరాం, బొత్సా, సీదిరి, చెన్నుబోయిన పాతమంత్రివర్గంలో కూడా ఉన్నారు. కొత్తగా ధర్మాన, పూడి, కారుమూరి, జోగి, విడదల, ఉషశ్రీ చేరారు. అంటే కంటిన్యు అవుతున్న పాతమంత్రులు, కొత్తగా చేరబోయే మంత్రుల వల్ల బీసీలంతా వైసీపీ వైపు వచ్చేస్తారని అనుకునేందుకు లేదు. అయితే తమ సామాజికవర్గానికి జగన్ ఇస్తున్న ప్రయారిటి కారణంగా బీసీలు తమవైపు వస్తారనేది జగన్ ఆలోచన. ఎందుకంటే టీడీపీ బలమే బీసీలన్న విషయం అందరికీ తెలిసిందే.
మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమికి బీసీల్లో వచ్చిన చీలిక కూడా కారణమనే చెప్పాలి. అయితే ఇంకా బీసీ సామాజికవర్గాల్లో కొంత భాగం టీడీపీని అంటిపెట్టుకునే ఉంది. దాన్నికూడా వైసీపీవైపు లాగేయాలన్నది జగన్ ఆలోచన. అలా జరిగితేనే చంద్రబాబునాయుడును ఓడగొట్టి టీడీపీని రాష్ట్ర రాజకీయాల్లో నుండి తుడిచేయాలనేది జగన్ వ్యూహం. ఇందుకోసమే క్షత్రియ, వైశ్య సామాజికవర్గాలకు ప్రాతినిద్యాన్ని త్యాగం చేసి ఆ స్ధానాలను కూడా బీసీలకే కేటాయించారు. మరి జగన్ వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది వచ్చే ఎన్నికల్లో తేలిపోతుంది.