అంతా సజ్జల కనుసన్నల్లోనే జరుగుతుందా..?

Deekshitha Reddy
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సీఎం జగన్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అందరికీ తెలిసిందే. ఒకరకంగా ఏపీలో మంత్రుల మాట కంటే సజ్జల మాటే ఎక్కువగా చెల్లుబాటయిన సందర్భాలున్నాయి. ఏపీలో ఉద్యోగుల సమ్మె, జీతాల పోరాటం సమయంలో మంత్రులకంటే సజ్జలే ఎక్కువగా మీడియా ముందుకొచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి దానికి శుభం కార్డు వేశారు. ఇప్పుడు మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ వేళ మరోసారి సజ్జల కీలకంగా మారారు. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర కొత్త మంత్రి వర్గం లిస్ట్ ఉందనే ఊహాగానాలు బలపడుతున్నాయి. ఆయనతోనే సీఎం జగన్ పలుమార్లు కొత్త మంత్రివర్గంపై చర్చలు జరుపుతున్నారు. దీంతో సజ్జల ఈ విషయంలో కీలకంగా మారారని తెలుస్తోంది.
జిల్లాల పునర్ విభజన అనంతరం సీఎం జగన్ ప్రస్తుతం కొత్త కేబినెట్‌ రూపకల్పనలో బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రులంతా ఇటీవలే తమ రాజీనామాలను సమర్పించారు. ఏపీ కొత్త మంత్రి వర్గం ఈనెల 11న ప్రమాణ స్వీకారం చేస్తుందని అంటున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లను అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. అయితే.. ఇప్పుడు కొత్త మంత్రులెవరు అనే అంశంపైనే మొత్తం చర్చ నడుస్తోంది. కొత్త మంత్రి వర్గం విషయంలో ఏపీలో రాజకీయాలన్నీ హీటెక్కాయి. అధికార పార్టీతోపాటు ప్రతిపక్షం, ప్రజలు కూడా కొత్త మంత్రి వర్గం ఎవరా అని ఎదురు చూస్తున్నారు. మాజీలవుతున్నవారిలో కొందరికి మాత్రం ఛాన్స్ ఉంటుందని తేలే సరికి అసలు మాజీలెవరు, కొత్తవారెవరు అనే చర్చ కొనసాగుతోంది. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. కానీ కొత్తవారికే ఎక్కువగా అవకాశాలు దొరుకుతాయని అంటున్నారు.
మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో సీఎం జగన్ తో శుక్రవారం ప్రభుత్వ సలహాదారు సజ్జల భేటీ ముగిసింది. మంత్రి వర్గ పునర్ వ్యవవస్థీకరణ పై ఆ విషయంలో సుదీర్ఘ చర్చ జరిగింది. దాదాపు మూడు గంటల సేపు వారిద్దరి మధ్య కొత్త మంత్రుల విషయంలో చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.  ఉన్నవారందరితో రాజీనామాలు చేయించినా, తిరిగి వారిలో కొందరికి జగన్ ఛాన్స్ లు ఇస్తారంటున్నారు. అయితే వారిలో ఎవరిని కొనసాగించాలి, కొత్తగా ఎవరికి అవకాశం కల్పించాలినే విషయంపై భారీగా కసరత్తులు చేస్తున్నారు. అసంతృప్తులు పెల్లుబకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సజ్జల కీలకంగా మారారు. ఆశావహులనుంచి వస్తున్న అభ్యర్థనలను ఆయన జగన్ దృష్టికి తీసుకెళ్తున్నారు. అదే సమయంలో అసంతృప్తులను బుజ్జగించే బాధ్యత కూడా సజ్జలకు అప్పగించారా అనే ప్రచారం జరుగుతోంది. మొత్తమ్మీద ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ విషయంలో సజ్జల కీలకంగా మారారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: