రష్యా రాక్షసత్వానికి పసివాళ్లు బలి..!

NAGARJUNA NAKKA
ఉక్రెయిన్ లోని పలు నగరాలపై రష్యా సైన్యం జరిపిన దాడుల్లో దాదాపు 145మంది చిన్నారులు మృతి చెందారు. 222మంది గాయపడినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఒక్క కీవ్ ప్రాంతంలోనే 69మంది చిన్నారులు మృతి చెందగా.. డొనెట్స్క్ ప్రాంతంలో 59, ఖర్కీవ్ ప్రాంతంలో 49మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్టు ఉక్రెయి్న పేర్కొంది.

ఇక దాదాపుగా నెల రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా సేనలు జరుపుతున్న దాడులను ఉక్రెయిన్ బలగాలు ధీటుగా ప్రతిఘటిస్తున్నాయి. యుద్ధంలో ఇప్పటి వరకు 17వేల 300 మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటించింది. అలాగే రష్యాకు చెందిన 131 విమానాలు, 131 హెలికాప్టర్లు, 605 యుద్ధ ట్యాంకులు, 17వందల 23 సాయుధ వాహనాలతో పాటు భారీగా యుద్ధ సామాగ్రిని ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ తెలిపింది.

నిన్నటి వరకు ఎన్ని దేశాలు ఆంక్షలు విధించినా.. మొండిగా ముందుకు సాగిన పుతిన్ ఒక్కసారిగా శాంతిమంత్రం జపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే యుద్ధం ప్రారంభమై 34రోజులైనా ఉక్రెయిన్ పై పైచేయి సాధించలేకపోవడమే రష్యా వెనక్కి తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది. భారీగా సైనికులను కోల్పోవడం, యుద్ధవాహనాలు ధ్వంసం, ఇర్పిన్ లాంటి నగరాలను ఉక్రెయిన్ మళ్లీ హస్తగతం చేసుకోవడంతో పుతిన్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.

ఇక ఉక్రెయిన్ రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలపై భారత్ స్పందించింది. రెండు దేశాలు తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఓ ఒప్పందానికి వస్తాయని ఆశిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మనదేశ శాశ్వత రాయబారి తిరుమూర్తి.. భారత్ అభిప్రాయాన్ని వెల్లడించారు. వీలైనంత త్వరగా యుద్ధానికి ముగింపు పలకాలని సూచించారు. అయితే ఉక్రెయిన్ కు భారత్ మానవతా సాయం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే రష్యా తన తీరు మాత్రం మార్చుకోవడం లేదు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు సరిహద్దు ప్రాంతంలో ఇంకా క్షిపణి దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఓ వైపు శాంతి చర్చల్లో పురోగతి లభించినా.. యుద్ధం విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా దక్షిణ ఉక్రెయిన్‌లోని మైకొలీవ్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌పై జరిగిన ఈ దాడిలో 12 మంది చనిపోయినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. ఆ దాడిలో ఆ బిల్డింగ్‌ చాలా వరకు ధ్వంసమైంది. మరోవైపు మరియుపోల్‌ నామరూపాల్లేకుండా పోయింది.








మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: