దట్ ఈజ్ చరణ్ పవర్..‘పెద్ది’ దెబ్బకు ఆ 10 సినిమాలు షట్ డౌన్.. ఇది మామూలు దెబ్బ కాదుగా..!
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘పెద్ది’ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే విపరీతమైన ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ప్రీమియర్ షోలు, భారీ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్, థియేటర్ల కేటాయింపులు వంటి అంశాలు చిన్న సినిమాల నిర్మాతల్లో ఆందోళన కలిగిస్తున్నాయట. ఎందుకంటే ఒక స్టార్ హీరో సినిమా విడుదలైనప్పుడు ఎక్కువ శాతం థియేటర్లు ఆ చిత్రానికే కేటాయించబడతాయి. దాంతో చిన్న సినిమాలకు సరిపడా స్క్రీన్లు దొరకకపోవడం, వచ్చినా ప్రేక్షకుల దృష్టి పూర్తిగా పెద్ద సినిమాపైనే ఉండడం వల్ల కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే ఈ ప్రభావం కొన్ని చిత్రాలపై స్పష్టంగా కనిపిస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘రావు బహదూర్’ చిత్రాన్ని మొదట జూన్ 3న విడుదల చేయాలని అధికారికంగా ప్రకటించారు. మంచి కంటెంట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. అయితే ‘పెద్ది’ విడుదల అదే రోజున ఉండటంతో, బాక్సాఫీస్ వద్ద పోటీ తీవ్రంగా ఉంటుందని భావించిన నిర్మాతలు విడుదల తేదీని జూలై 3కు మార్చినట్లు తెలుస్తోంది. సరైన సోలో రిలీజ్ దొరికితేనే సినిమా మంచి ఫలితాలు సాధిస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
అలాగే స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా పరిస్థితి కూడా దాదాపు ఇదేలా మారింది. ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మొదట మే 14న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అందుకు అనుగుణంగా ప్రమోషన్స్ కూడా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అయితే షూటింగ్ పనులు పూర్తికాకపోవడంతో విడుదల తేదీని జూన్ 4కు మార్చాలని భావించారు. కానీ అదే సమయంలో ‘పెద్ది’ రిలీజ్ ఉండటంతో నిర్మాతలు మరోసారి ఆలోచించి చివరకు జూన్ 19కు వాయిదా వేసినట్లు సమాచారం.
ఇవి మాత్రమే కాకుండా ఇంకా పలు చిన్న మరియు మధ్య తరహా చిత్రాలు కూడా తమ విడుదల తేదీలను మార్చుకున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాలు కూడా ‘పెద్ది’తో పోటీ పడటానికి ఆసక్తి చూపడం లేదట. కారణం ఏంటంటే, రామ్ చరణ్ సినిమాకు ఉండే ఓపెనింగ్స్, అభిమానుల హడావిడి, భారీ ప్రమోషన్స్ కారణంగా ఇతర సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కష్టమవుతుంది. అందుకే చాలా మంది నిర్మాతలు సేఫ్ జోన్ కోసం వేరే తేదీలను ఎంచుకుంటున్నారని సమాచారం. సినీ పరిశ్రమలో ప్రస్తుతం వినిపిస్తున్న అంచనాల ప్రకారం, ‘పెద్ది’ ప్రభావంతో దాదాపు పది వరకు సినిమాలు తమ విడుదల తేదీలను మార్చుకున్నాయట. ఇది ఒక స్టార్ హీరో మార్కెట్ రేంజ్ ఎంత బలంగా ఉందో చూపించే ఉదాహరణగా సినీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా థియేట్రికల్ మార్కెట్ ప్రస్తుతం పూర్తిగా స్టార్ హీరోల సినిమాల చుట్టూనే తిరుగుతోందని, చిన్న సినిమాలు సరైన రిలీజ్ డేట్ కోసం ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి వస్తోందో ఈ పరిస్థితి స్పష్టంగా తెలియజేస్తోంది.
మరోవైపు అభిమానులు మాత్రం ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార కార్యక్రమాలు సోషల్ మీడియాలో మంచి హైప్ తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదల సమయానికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ సందడి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.