శ్రీ” ఆలోచనలలో అక్షరాలు ! “అమ్మ” అంటే ప్రేమ స్వరూపిణి !

Seetha Sailaja
శ్రీ” ఆలోచనలలో అక్షరాలు ! 


“అమ్మ” అంటే ప్రేమ స్వరూపిణి !


ప్రపంచంలో అతి పేదవాడు అత్యంత ధనవంతుడు మధ్యతరగతి సగటు వ్యక్తి ఇలా ఎన్నో వర్గాలుగా మనుషులు ఉన్నారు కాని తల్లి   ప్రేమను ఎరుగని వారు ఉండరు. వ్యక్తిత్వం  రీత్యా చెడ్డ మనుషులు ఉంటారు కాని అటువంటి దుర్మార్గమైన వ్యక్తికి జన్మను యిచ్చిన ఆతల్లి మాత్రం తన  పిల్లలు మంచి వారే అంటూ వాదిస్తుంది.     


తల్లి ప్రేమకు గుర్తుగా ‘మే’ రెండో ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా మాతృదినోత్సవాన్ని జరుపుకునే నేటి సాంప్రదాయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. గ్రీస్‌లో ‘రియా’ అనే దేవతను ‘మదర్‌ ఆఫ్‌ గాడ్స్‌’ గా భావించి ఏడాదికోసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా ‘మదరింగ్‌ సండే’ పేరిట ఉత్సవాన్ని జరిపేవారు. ‘జూలియవర్డ్‌ హోవే’ అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతికోసం మదర్స్‌డే నిర్వహించాలని ప్రతిపాదించింది. ఆమె 1905 మే 9న మృతిచెందగా ఆమె కుమార్తె మిస్‌ జెర్విస్‌ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాతృ దినోత్సవం జరుపుకోవడం మొదలైంది.


దాని ఫలితంగా 1914 నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ నిర్ణయించారు. కాలక్రమేణా ప్రపంచమంతా ఈ మాతృ దినోత్సవ సంస్కృతి  విస్తరించింది. అమ్మ అనే ఒక్క మాటలో ప్రేమ త్యాగం కరుణ కలిసిపోయి ఉంటాయి. మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తికి మొదటి గురువు ‘అమ్మ’ మాత్రమే. అమ్మ మనకు జన్మను ఇవ్వడమే కాదు తన పిల్లలు సాధించిన ప్రతి విజయాన్ని ఆమె ఎంతో గొప్పగా భావిస్తూ ఉంటుంది. ఈ మాతృ దినోత్సవం మన భారతీయ సంస్కృతిలో ‘మాతృదేవో భవ’ అన్న భావనతో కొనసాగుతూనే ఉంది. 


ఈ మాతృ దినోత్సవంలో ఒక సామాజిక సందేశం కూడ ఇమిడి ఉంది. తల్లిని ప్రేమించాలి గౌరవించాలి ఆమెకు ఎల్లవేళలా తోడుగా ఉండాలి అన్న సందేశం అంతర్లీనంగా కనిపిస్తుంది.  ఈనాటి మాతృ దినోత్సవం సందర్భంలో “వర్తమాన మహిళ” పాత్రను పరిశీలిస్తే నేటి సమాజంలో మహిళ ఒకే సమయంలో అనేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ  శక్తివంతమైన వ్యక్తిత్వంతో కనిపిస్తుంది.


ఇప్పటి మహిళ కేవలం ఇంటి పనులకే పరిమితం కాదు. ఆమె విద్యావంతురాలు, ఉద్యోగి, నాయకురాలు, వ్యాపారవేత్తగా ఎదుగుతోంది. కుటుంబాన్ని ప్రేమతో కాపాడుతూ సమాజ అభివృద్ధిలో కూడా భాగస్వామి అవుతోంది. పిల్లల పెంపకంలో ఆమె పాత్ర అమూల్యం. ‘మాతృ దినోత్సవం’ రోజున మనం కేవలం తల్లిని గౌరవించడం మాత్రమే కాదు ఆమె చేస్తున్న సేవలను గుర్తించి కృతజ్ఞతను తెలిపినప్పుడే ఈ మాతృ దినోత్సవానికి ఒక సార్థకత. వాస్తవానికి నేటి మహిళ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, అన్నింటిని సమతుల్యం చేస్తూ ముందుకు సాగడం ఒక సగటు మహిళకు అంత సులువైన పనికాదు. దీనికోసం నిరంతరం ఆమె పోరాడుతూనే ఉండాలి. 


సమాజం ఎంత అభివృద్ది చెందినప్పటికీ ఇప్పటికీ మహిళలకు పూర్తి స్వేచ్ఛ సమాన హక్కులు అందడం లేదు అన్న చర్చలు జరుగుతున్నాయి. ఈ మాతృ దినోత్సవం సందర్భంగా మహిళల సాధికారత గురించి చర్చలు జరగడం పరిపాటిగా మారింది కానీ ఆచర్చల సారాంశం వాస్తవ రూపానికి నోచుకోవడం లేదు. వర్తమాన మహిళ అంటే శక్తి, సహనం, ప్రేమకు ప్రతీక అంటూ ఆమెను గౌరవించడం జరుగుతోంది కాని ఇప్పటికీ పురుషాధిక్య ప్రపంచంలో మహిళ వివక్షతకు గురి అవుతూనే ఉంది. “అమ్మ” అంటే ఒక ప్రేమ స్వరూపిణి.. 




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: