అమరావతి : టీడీపీకి మిగిలేది చరిత్ర మాత్రమేనా ?
పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గతాన్ని తలచుకుంటు కాలక్షేపం చేసే ఏ పార్టీకీ భవిష్యత్తుండదనేది అందరికీ తెలిసిందే. ఏ పార్టీకి అయినా చరిత్ర ఎంత ముఖ్యమో భవిష్యత్తూ అంతే ముఖ్యం. చరిత్రలోని విజయాలను నెమరేసుకుంటునే తప్పులను కూడా నిజాయితీగా గుర్తుచేసుకోవాలి. ఆ తప్పులను భవిష్యత్తులో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నపుడే పార్టీకి భవిష్యత్తుంటుంది.
టీడీపీలో ఈ నిజాయితీయే లోపించింది. ఇక్కడ విషయం ఏమిటంటే చంద్రబాబునాయుడుకు ఎంతసేపు విజయాల గురించి మాట్లాడుకోవటం మాత్రమే ఇష్టముంటుంది. తప్పులను, లోపాల గురించి నిజాయితీగా విశ్లేషించుకోవటం ఏమాత్రం ఇష్టముండదు. ఎంతసేపు హైటెక్ సిటీని కట్టాను, హైదరాబాద్ ను పునర్నర్మించాను, బిల్ గేట్స్ ను రాష్ట్రానికి తెచ్చాను అని చెప్పుకోవటం, భజన చేయించుకోవటానికే బాగా అలవాటుపడిపోయారు.కేత్రస్ధాయిలో పార్టీ వాస్తవ పరిస్ధితిని నేతలు వివరించినా వినిపంచుకునే స్ధితిలో చంద్రబాబు లేరన్నది వాస్తవం.
మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోరాతిఘోరంగా 23 సీట్లకు మాత్రమే ఎందుకు పరిమితమైపోయింది ? అనే విషయంపై విశ్లేషించుకునేంత ధైర్యంలేదు. టీడీపీ ఘోరంగా ఓడిపోవటానికి జనాలను జగన్మోహన్ రెడ్డి మాయచేశాడు, మోసం చేశాడు, ఒక్కఛాన్సని సెంటిమెంటు ప్రయోగించాడు, జనాలు జగన్ కు అధికారం ఇచ్చి తప్పుచేశారు.. ఇలాంటి పనికిమాలిన మాటలు చెప్పుకుంటూ మూడేళ్ళు గడిపేశారు. ఘోరఓటమికి తాముచేసిన తప్పులేంటి ? పరిపాలనలో లోపాలేంటి అనే విషయాన్ని నిజాయితీగా ఒక్కసారి కూడా విశ్లేషించుకోలేదు.
తన హయాంలో పరిపాలన ఎంత అధ్వాన్నంగా ఉండుంటే, ఎన్ని అరచకాలు జరిగుంటే, పాలన ఏ స్ధాయిలో ఏకపక్షంగా సాగుంటే జనాలు మండిపోయి టీడీపీని 23 సీట్లకు పరిమితం చేసుంటారు ? అనే విషయాన్ని చంద్రబాబు ఎనలైజ్ చేసుకోవాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎల్లోమీడియాలో కాకుండా జనాల్లోకి వచ్చి పోరాటాలు చేయాలి. జనాల్లో నమ్మకం కలగనంత వరకు టీడీపీని ఆదరించే సమస్యే ఉండదు. అప్పటివరకు టీడీపీకి మిగిలేది కేవలం చరిత్ర మాత్రమే అని చంద్రబాబు గుర్తుంచుకోవాలి.