ఎవరూ బతకరు: జగన్ పై చంద్రబాబు షాకింగ్‌ కామెంట్స్?

Chakravarthi Kalyan
టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే.. ఇక ఎవరూ బతకరు అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో కలసి చంద్రబాబు నివాళి అర్పించిన తర్వాత వారు జగన్ పాలనపై స్పందించారు.

జంగారెడ్డి గూడెంలో కల్తీసారా వల్ల 20 మందికిపైగా చనిపోతే సీఎం జగన్ వాటిని సహజ మరణాలు అనడం చాలా దారుణం అన్న చంద్రబాబు.. ఇలాంటి వైసీపీ అధికారంలోకి వస్తే ఇక ఎవరూ ఏపీలో బతకలేరు, బతకనివ్వరు అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం వ్యాపారులను తీవ్రంగా వేధిస్తోందని..  వసూళ్లకు పాల్పడుతోందని.. జీఎస్టీతో పాటు జేఎస్టీ.. అంటే జగన్ ట్యాక్స్ కూడా వ్యాపారులు కట్టాల్సి వస్తోందని చంద్రబాబు ఆరోపించారు.

ఇక వైశ్యులకు జరుగుతున్న అన్యాయంపైనా చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఇటీవల మరణించిన రాజకీయ ఉద్దండడు కొణిజేటి రోశయ్య ను గౌరవించుకునేలా ప్రభుత్వ సంస్థకో, కార్యక్రమానికో రోశయ్య పేరు ఎందుకు పెట్టరని చంద్రబాబు జగన్ ను నిలదీశారు. అంతే కాదు..
రోశయ్యకు నివాళి ఘటించడానికి కూడా సీఎం జగన్ కు మనసు రాలేదని.. మాజీ సీఎంలు వెంగళరావు, విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి చనిపోతే తన హయాంలో వారి పేర్లను ప్రభుత్వ సంస్థలకు వారి పేరు పెట్టి గౌరవించామని గుర్తు చేసుకున్నారు.

అంతే కాదు.. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొణిజేటి రోశయ్యను తగిన విధంగా గౌరవించుకుంటామని చంద్రబాబు వైశ్యులకు హామీ ఇచ్చారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్య వైశ్య వర్గ నేతలు, కార్యకర్తలు పాల్గొని నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లే భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: