అన్ని రాజకీయ పార్టీల గురి తెలంగాణ పై పడింది.పంజాబ్లో అధికారం చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో విస్తరించాలనుకుంటున్నది. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ వచ్చే నెల 14న హైదరాబాద్ వస్తున్నాడు. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు అంబేద్కర్ జయంతిని ముహూర్తంగా నిర్ణయించారు. ఒక రోజు పర్యటనలో భాగం గా రాష్ట్రంలోని తాజా పరిస్థితులను విశ్లేషించి దానికి అనుగు ణంగా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించ నున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ ప్రాథమిక స్థాయి లోనే ఉండగా అన్ని జిల్లాల్లోనూ కమిటీలను ఏర్పాటు చేయ డంపై ఏప్రిల్ 14న పార్టీ నేతలతో రివ్యూ చేయనున్నారు.
దక్షిణాదిలో నిలదొక్కుకోవాలనుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవహారాలు చూసే ఆ పార్టీ నాయకుడు సోమనాథ్ భారతి వివరించారు. అందులో భాగంగానే ప్రస్తుతం తెలంగాణలో సెర్చ్ కమిటీ పని చేస్తున్నదని కేజ్రీవాల్ వచ్చే నెలలో పర్యటించి పార్టీ సంస్థాగత నిర్మాణం పై దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై పార్టీకి స్పష్టమైన అవగాహన ఉన్నదని, ప్రజల్లో అసంతృప్తితో పాటు వ్యతిరేకత కూడా ఉన్నదని మీడియాతో వ్యాఖ్యానించారు.దీన్ని దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పాదయాత్రలు ఏప్రిల్ 14 నుంచి మొదలు పెట్టాలనే ప్రాథమిక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. అప్పటికి జిల్లా కమిటీల పై కొంత అవగాహన వస్తుందని, వారి ఆధ్వర్యంలోనే స్థానిక సమస్యలు,పాదయాత్రలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో అవినీతి, నిరుద్యోగం,ప్రజలకు సరైన తీరులో ప్రభుత్వ సేవలు అందడం లేదని, వీటిపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ తెలిపారు.
విద్య,వైద్యం పై విస్తృతంగా ప్రజల్లోకి వెళతామని,ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ రెండు రంగాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తామన్నారు.అవినీతి విచ్చలవిడిగా పెరిగి పోయిందని, ఇదే అంశాన్ని ఇటీవల పార్టీ పెద్దలతో చర్చించినట్లు గుర్తు చేశారు. కేజ్రీవాల్ పర్యటన తర్వాత పార్టీ నిర్మాణంపై స్పష్టత వస్తుందని,అప్పటికల్లా తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉంటామని తెలిపారు.రాష్ట్రంలో అన్ని పార్టీలతో ప్రజలు విసిగిపో యారని, ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని, దానికి సరైన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.