ఓ వైపు నాటో పై నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు నాటో స్నేహహస్తమైన అమెరికాకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఓ వైపు రష్యాతో రాజీకి సిద్దమంటూనే, మరోవైపు వెనకడుగు వేసేది లేదంటూ కుండబద్దలు కొడుతున్నారు. అవును రష్యాతో యుద్ధం వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గంటల వ్యవధిలోనే ఆయన చేసిన భిన్న ప్రకటనలు చూస్తుంటే యుద్ధాన్ని ఎదుర్కోవడంలో ఆయన ఎంత సతమతమవుతున్నారో తెలిసిపోతుంది. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు నాటో సభ్యత్వం కూడా అవసరం లేదన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు, కొన్ని గంటల తర్వాత బ్రిటన్ పార్లమెంట్ ప్రసంగంలో భిన్న వ్యాఖ్యలు చేశారు.
చివరి వరకు పోరాడతామని యుద్ధంలో విజయం ఉక్రెయిన్ దే అన్నారు. రష్యా వారించినా, వార్నింగ్ ఇచ్చినా నిన్నమొన్నటి వరకు పశ్చిమ దేశాల వైపు పరుగులు పెట్టిన జెలన్ స్కీ ఇప్పుడు ఆ దేశాల పైనే విరుచుకు పడుతున్నారు. ఉక్రెయిన్ పౌరుల హత్యలకు రష్యా కారణమని వారిని కాపాడగలిగే స్థితిలో ఉన్నా కూడా ఏం చేయని పశ్చిమ దేశాలు కూడా తమ పౌరుల మరణాలకు బాధ్యత వహించాల్సిందేనని ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే జెలన్ స్కీ తన రూటు మార్చాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బ్రిటన్ పార్లమెంట్ లో జెలన్ స్కీ చేసిన ప్రసంగం పూర్తి భిన్నంగా ఉంది. రష్యాను ఉగ్రవాద దేశంగా గుర్తించాలని, ఆ దేశంపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని కోరారు. బ్రిటన్ పార్లమెంట్ ను ఉద్దేశించి వర్చువల్ గా చేసిన ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాటి బ్రిటన్ ప్రధాని చేసిన నెవర్ సరెండర్ ప్రసంగాన్ని తలపించేలా మాట్లాడారు. షేక్స్పియర్ వ్యాఖ్యలను ఆయన గుర్తు చేసుకున్నారు. రష్యా తనపై చేస్తున్న యుద్ధాన్ని తిప్పికొట్టేందుకు చివరి వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తాము ఎప్పటికీ లొంగబోమని తేల్చిచెప్పారు. ఉక్రెయిన్ గగనతలం సురక్షితంగా ఉండేలా రష్యా పై కఠిన ఆంక్షలు విధించాలని బ్రిటన్ పార్లమెంటుకు ఆయన విజ్ఞప్తి చేశారు. బ్రిటన్ ఇతర యూరప్ దేశాలు తమకు సాయం చేయాలని జెలన్ స్కీ అభ్యర్థించారు.
రష్యా అంటే నాటో దేశాలకు భయం అని అందుకే ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకోవడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు జెలెన్ స్కీ. మోకాళ్లపై నిలబడి ప్రాధేయ పడే దేశానికి తాను అధ్యక్షున్ని కానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు జెలెన్ స్కీ. మరోవైపు జెలెన్ స్కీ కి బ్రిటన్ లో అరుదైన గౌరవం దక్కింది. ఒక విదేశీ అధ్యక్షుడు హౌస్ ఆఫ్ కామర్స్ లో ప్రసంగించడం బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఆయన ప్రసంగం ఓ చారిత్రాత్మకం అంటూ బ్రిటన్ ప్రశంసల వర్షం కురిపించింది. జెలెన్ స్కీ ప్రసంగం ముగిసిన వెంటనే ఆయనకు బ్రిటన్ పార్లమెంట్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది.