జోబైడెన్ షాక్‌: పుతిన్‌తో ఇక మాటల్లేవ్‌?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత.. కాస్త ఆలస్యంగా రష్యా చర్యపై అమెరికా స్పందించింది. ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌ పై ఏక పక్షంగా దాడికి దిగినందున ఇక పుతిన్‌తో మాట్లాడే ఆలోచన లేదని  అమెరికా అ‌ధ్యక్షుడు బైడెన్‌ తేల్చి చెప్పారు. రష్యా తన చర్యలకు తగిన మూల్యం తప్పకుండా చెల్లిస్తుందన్న జో బైడెన్.. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నామని ప్రకటించారు.

వీటీబీతో సహా మరో నాలుగు రష్యన్‌ బ్యాంకులపై జో బైడెన్ ఆంక్షలు విధించారు. పుతిన్‌ మళ్లీ పాత సోవియట్ యూనియన్‌ను తిరిగి స్థాపించాలనుకుంటున్నారని ఆరోపించిన బైడెన్‌... పుతిన్ ఆలోచనలు అంతర్జాతీయ సమాజానికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. అంతే కాదు.. రష్యా సైబర్‌ అటాక్‌పై స్పందించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. పుతిన్‌ ఉక్రెయిన్‌తో యుద్ధం ఎంచుకున్నారని.. అందుకు రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని బైడెన్‌ హెచ్చరించారు.  

అయితే అమెరికా స్పందన ఉక్రెయిన్ దేశాన్ని నిరాశ పరిచిందని చెప్పాలి.. ఓ వైపు రష్యా తమ దేశంలోకి చొరబడి రణ రంగం సృష్టిస్తుంటే.. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి నాటో దేశాలు కేవలం మాటలతోనే కాలం గడుపుతున్నాయని ఉక్రెయిన్ ఆవేదన చెందుతోంది. రష్యా తమపై దాడికి దిగితే తమకు అండగా నాటో దేశాలు తమ బలగాలను పంపుతాయని మొదట ఉక్రెయిన్ ఆశించింది. ఇప్పుడు రష్యా ఇంతగా విరుచుకుపడుతున్నా.. ఏ ఒక్క దేశమూ తనకు సాయంగా రాకపోవడాన్ని ఉక్రెయిన్ జీర్ణించుకోలేకపోతోంది.

ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న అమెరికా రష్యా విషయంలో ఆచితూచి స్పందిస్తోంది. యుద్ధం అంటూ వస్తే.. దాని ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపైనా పడుతుంది. అయితే.. రష్యా మాత్రం ఎవరి మాటా వినే పరిస్థితి కనిపించడం లేదు. ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తోంది. ఉక్రెయిన్ పౌరులెవ్వలరికీ హాని తలపెట్టబోమని చెబుతున్నా.. రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌ లోని సాధారణ జనం కూడా మరణిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ మారణ కాండకు ముగింపు ఏంటన్నది అర్థం కాని ప్రశ్నగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: