గౌతమ్ రెడ్డి : చావు ఇంట నవ్వులొస్తాయా నాని ?
ఏం కాదు
నవ్వినా తిట్టినా కొట్టినా కూడా ఏం కాదు
కానీ నవ్వుతూ నవ్వుల పాలుకావడం తప్పు
ఒకరి మరణం దగ్గర హోదా మరిచి
వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా ప్రవర్తించి
వారి దుఃఖాన్ని ఇంకా రెట్టింపు చేయడం ఇంకా తప్పు
అయినా ఇవన్నీ మనం పట్టించుకుంటాం కానీ
మన నాయకులు ? అబ్బే వాళ్లకు అవేవీ అక్కర్లేదు!
బూతులు తిట్టే మంత్రి కొడాలి నాని మరో సారి వివాదంలో ఇరుక్కున్నారు.ఆయనతో పాటు చంద్రబాబును అదే పనిగా తిట్టే వల్లభనేని వంశీ అనే ఎమ్మెల్యే కూడా తమ స్థాయిని మరిచి ప్రవర్తించారన్నది ఓ అభియోగం.సరే!ఎవరి అభిప్రాయం ప్రకారం ఎలా ఉన్నా మనుషులు కొన్నిసందర్భాల్లో అయినా తమ కనీస బాధ్యతను పాటించాలి.కనీసం దిగజారకుండా హుందాగా ఉండాలి. అసలే కొడాలి నాని లాంటి నాయకులు ఎప్పుడు దొరుకుతారా అని వేచి చూస్తే టీడీపీకి కావాల్సినంత స్టఫ్ ఇచ్చారు సంబంధిత మనుషులు మరియు నాయకులు.
ఎంతైనా విషాదం విషాదమే. ఎవ్వరు ఔనన్నా కాదన్నా చావు పుట్టుకల దగ్గర మనుషులంతా సమానమే! అలాంటి చోట కూడా మనుషులు మరింత దిగజారి ఉండడం అన్నది ఆక్షేపణీయం.ఏపీ మంత్రులు మామూలుగానే పెద్దగా తమ స్థాయికి అనుగుణంగా ప్రవర్తించిన దాఖలాలు ఉండవు.అలాంటిది నిన్నటి వేళ లోపల ఎలా ఉన్నా, తమ సహచరుడ్ని కోల్పోయిన బాధను కనీసం పైకి చూపించి హుందాగా ఉండాలన్న విషయం కూడా మరిచి పోయి ప్రవర్తించారని టీడీపీ అంటోంది.
నిన్నటి వేళ హఠాన్మరణం చెందిన గౌతమ్ రెడ్డి ఇంటికి వెళ్లిన మంత్రి నానితో సహా వివాదాస్పద ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్కడ నవ్వులు పువ్వులు పూయిస్తూ వీడియోలకు చిక్కారు. దీంతో చావు ఇంట నవ్వులు ఎలా వస్తాయి అని ప్రశ్నిస్తూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది.మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తో సహా మిగతా నేతలంతా నిన్నటి వేళ ఎంతో హుందాగా ప్రవర్తించారని,వైసీపీ నాయకులు మాత్రం (అందరూ కాదు కొందరు) తమకు నచ్చిన విధంగా తోచిన విధంగా అక్కడ నవ్వు ముఖాలతో కనిపించారని టీడీపీ ఆరోపిస్తోంది.