మంగళగిరికి లోకేష్ దూరం.. అసలు కథేంటి..?
కొన్నిరోజులుగా మంగళగిరిలో లోకేష్ పర్యటనలకు బ్రేక్ పడింది. పోనీ కరోనా వల్ల ఆయన ఇల్లు కదలలేకపోయారని అనుకున్నా.. ఆ తర్వాత కూడా లోకేష్ పెద్దగా జనాల్లోకి వచ్చింది లేదు. లోకేష్ ఇక మంగళగిరికి బైబై చెప్పేసినట్టే అంటూ వైరి వర్గాలు కూడా ప్రచారం ముమ్మరం చేశాయి. అయితే టీడీపీ వర్గాలు మాత్రం లోకేష్ కచ్చితంగా మంగళగిరినుంచే పోటీ చేస్తారని అంటున్నాయి.
గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న లోకేష్.. రాజధాని ప్రాంతం కావడంతో మంగళగిరినుంచి పోటీ చేశారు. వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన చాన్నాళ్లపాటు మంగళగిరికి దూరంగా ఉన్నారు. అటు లోకేష్ పై గెలిచినా కూడా వైసీపీలో ఆళ్లకు పెద్ద ప్రాముఖ్యత దక్కలేదు. మంత్రి పదవి అనుకున్నారు కానీ అది సాధ్యం కాలేదు. ఇతర ప్రాముఖ్యత ఉన్న పోస్ట్ లు కూడా ఏవీ దక్కలేదు. దీంతో ఆయన నియోజకవర్గానికి, నియోజకవర్గ ప్రజలకు కొంత దూరంగా ఉన్నారనే ప్రచారం జరిగింది. ఈ దశలో మళ్లీ లోకేష్ ఎంటరయ్యారు. మంగళగిరిలో తన సత్తా చూపించడానికి కదిలారు. అందర్నీ కలుపుకొనిపోతూ ముఖ్యంగా చేనేత సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మంగళగిరిలో టీడీపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. అయినా కూడా లోకేష్ మంగళగిరికే ఫిక్స్ అయ్యారు. ఇటీవల కొంత గ్యాప్ వచ్చినా.. తిరిగి లోకేష్ మంగళగిరికే వస్తారని, ఆయన అక్కడినుంచే పోటీ చేస్తారని పార్టీ వర్గాలంటున్నాయి.