పీకే డైరెక్షన్లో కేసీఆర్ నడుస్తున్నారా..? బడ్జెట్ పైన, మోడీ సర్కార్ పైన గరం అవ్వడం వెనుక మతలబ్ అదేనా? తెలంగాణలో పీకే వ్యూహాలు ఏ మేరకు వర్కౌట్ కానున్నాయి..?దేశ రాజకీయాల్లో కారు స్టీరింగ్ తిప్పగలిగినంత ఈజీగా రాజకీయాలు చేయగల నేర్పు మా బాస్ కెసిఆర్ సొంతమని గులాబీ దళంలో లీడర్ నుంచి కేడర్ వరకు అంతా ఢంకా బజాయించి మరీ చెబుతారు. మరి అంత ఈజీగా రాజకీయాలు చేసే సీఎం కేసీఆర్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ఎందుకు ఆశ్రయించారనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారు. కానీ తెలంగాణ వచ్చిన సమయంలో ఉన్న పరిస్థితులు నేడు రాష్ట్రంలో లేవు.
అంతేకాదు అటు ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ఎండగడుతూ ప్రజల్లోకి దూసుకుపోతుంటే, తెలంగాణ ప్రజలు సైతం చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం కేసీఆర్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నారంటూ,ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు సీఎం కేసీఆర్ ఫాలో అయిపోతున్నారని సమాచారం. అయితే ఫిబ్రవరి 1న మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఆ క్రమంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గంటన్నర సేపు బడ్జెట్ పై ప్రసంగిస్తే, సీఎం కేసీఆర్ మాత్రం రెండున్నర గంటల ప్రెస్ మీట్ పెట్టి కేవలం మోడీ ప్రభుత్వాన్ని తిట్టారనే టాక్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రశాంత్ కిషోర్ స్క్రిప్టులో భాగంగానే కేసీఆర్ ఇలా చేశారనే టాక్ నడుస్తోంది. ఈ ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు ఓ రేంజ్ లో వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు. గతంలో చాలా సార్లు బడ్జెట్ ప్రసంగం చేసినా కెసిఆర్ ఏనాడు మోడీ ప్రభుత్వంపై ఇలా ఉతుకుడు కార్యక్రమం చేపట్టింది లేదని తెలంగాణ ప్రజలు గుర్తు చేస్తున్నారు. కానీ బీజేపీతో తనకూ,తన పార్టీకి ముప్పు తప్పదనే ఒకే ఒక్క భయం తో సీఎం కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో ఎటాక్ స్టార్ట్ చేశారని కమలదళం స్పష్టంచేస్తోంది. 2023 లో గెలుపు కోసం సీఎం కెసిఆర్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.
మరి నిజంగానే తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగితే బెంగాల్ తరహాలోనే ఇక్కడ కూడా బిజెపికి భంగపాటు తప్పదేమో అనే చర్చ మొదలైంది. దీంతో పీకే వ్యూహాలను ఎదుర్కోవడానికి కమలనాథులు సైతం కెసిఆర్ పై గట్టిగానే పోరాటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాజ్యాంగం పై కేసీఆర్ వ్యాఖ్యలపై తమ వాయిస్ వినిపించేందుకు సైతం తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికల నాటి కల్లా టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలవాలన్న తమ ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఏర్పడుతుందేమోనన్న టెన్షన్ కమలనాథుల్లో కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.