పీఆర్సీ పోరు : మనుషుల్రా వాళ్లు.. సెబ్సాస్ విజయవాడ!
చదువులు చెప్పే తల్లులు
విద్యను బోధించే సందర్భాన
తప్పులు దిద్దే తల్లులు
ఉన్నపళాన తమ హక్కుల కోసం
రోడ్డెక్కారు.. నడి నెత్తిన సూరీడు
చదువు మాత్రమే కాదు మీరు నేర్చుకోవాల్సింది సంస్కారం కూడా ! అని చాటిచెబుతూ విజయవాడ.. కొందరికి అండగా నిలిచింది.. హక్కులే కాదు బాధ్యతలు అన్నవి ఎంతో ముఖ్యం అని మరోసారి గుర్తు చేసింది. కృష్ణ మ్మ చెంత ఉద్యమం ఎలా ఉంది.. పోటెత్తి ఉంది.. నీరు పొంగిన కనులలో నీటి తెరలు అడ్డునిలిచిన సందర్భాలు ఏమయినా ఉన్నాయా.. కవీ! ఉండే ఉండాలి.. ఉంటే వాటిని వెలికి తీయండి..వెతికి వెతికి ఆ దృశ్యాలకో భాష్యం చెప్పండి కవీ!
గుక్కెడు నీళ్లు జీవితాన్ని ప్రభావితం చేశాయి..గుక్కెడు నీళ్లు దాహార్తిని తీర్చి పంపాయి.ఉద్యోగులు,ఉపాధ్యాయులు ఆ విజయవాడ దారుల్లో దాహార్తితో అల్లాడుతుంటే గుక్కెడు నీళ్లు గొంతు తడిపి, కొత్త ఉత్సాహం ఇచ్చి పంపాయి. కృష్ణమ్మ నీళ్లకు మీరంతా రుణపడి పోయారు.కృష్ణ నీటిపై ఉద్యమ కాంతుల ప్రజ్వరిల్లుతుంటే మీరంతా విస్తుబోయారు..ఉద్దేశం ఏదయినాసరే రోడ్డెక్కిన బిడ్డలు వారు.. బిడ్డల తల్లులు తండ్రులు వారు..వారికి గుక్కెడు నీళ్లివ్వడం బాధ్యత..ఆదుకోవడం బాధ్యత.. విజయవాడ దారుల్లో ప్రజలు తమ ఊరికి వచ్చిన అతిథులకు కాస్త సాయం చేసి పంపారు.
ప్రభుత్వాలు ఎలా ఉన్నా మనుషులు ఉన్నారు సర్..వారికి మనం వందనాలు చెల్లించాలి. ఇవాళే కాదు ఎప్పటికీ గెలిచే మానవత్వం గొప్పది..అరిగిన చెప్పులు.. విషాద సందర్భాలను సంకేతిస్తాయేమో కానీ జీవితం మాత్రం ఎప్పుడూ ఒకరి ఆసరాలో పొందే ఆనందాలనే గుర్తిస్తుంది. ఉద్యమం ఏమయినా సరే ! వాళ్ల భాష ఎలా ఉన్నా సరే ! ఇవాళ పోటెత్తిన ఉద్యోగులు ప్రభువులకో సంకేతాలు పంపారు. డియర్ టీచర్ ! మీరు గెలవండి మానండి అవేవీ తెలియదు మా ప్రభుత్వ బడులకు మళ్లీ మీరు వెళ్లి మంచి ఫలితాలు సాధించండి చాలు.