రష్యా సైబర్‌ వార్.. ఆ దేశం తట్టుకుంటుందా..?

Chakravarthi Kalyan

ఇది టెక్నాలజీ యుగం.. ఇప్పుడు ఒక దేశం మరో దేశంపై యుద్ధం చేయాలంటే.. సైన్యంతోనే చేయాల్సిన పని లేదు. పెరిగిన టెక్నాలజీ కారణంగా బయోవార్స్, సైబర్ వార్స్ పెరుగుతాయన్న అంచనాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు రష్యా తీరు చూస్తే అది నిజమే అనిపిస్తోంది. సైబర్‌ వార్ కు ఇది ఓ ప్రత్యక్ష ఉదాహరణ.. అవును.. ఇప్పుడు రష్యా దేశం తన పక్కన ఉన్న ఉక్రెయిన్‌పై సైబర్ దాడులతో విరుచుకుపడుతోంది.

కొన్ని నెలలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదం నడుస్తోంది. ఉక్రెయిన్‌ దేశం విషయంలో రష్యా.. అమెరికా, నాటో కూటమి దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఓ భూభాగం విషయంలో ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా ఇటీవల సైన్యం కూడా మోహరించింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్‌లో నిన్న భారీ సైబర్‌ దాడి జరిగిందని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. ఉక్రెయిన్‌కు చెందిన  అనేక కీలక వెబ్‌సైట్‌లు ఈ సైబర్‌ దాడి కారణంగా పనిచేయకుండా పోయాయి. ఇది రష్యా పనేనని ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి. రష్యా తన సైన్యాలను వెనక్కి రప్పించాలంటూ అమెరికా, నాటో కూటమి డిమాండ్‌ చేశాయి. అయినా రష్యా అందుకు అంగీకరించడం లేదు. దీనిపై అమెరికా, రష్యాల మధ్య జరిగిన చర్చలు కూడా  విఫలం అయ్యాయి.

ఈ నేపథ్యంలో రష్యా దేశపు సైబర్ ఎటాక్ కారణంగా.. ఉక్రెయిన్‌లోని విదేశాంగ, విద్యా, కేబినెట్‌ వంటి అనేక వెబ్‌సైట్‌లు మూతపడ్డాయి. తమ దేశ  సైబర్ పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటి వరకూ ఈ దాడికి మేమే కారణం అని ఎవరూ ప్రకటించుకోకపోయినా ఇది రష్యా పనే అని అనుమానిస్తున్నారు. విదేశాంగశాఖ వెబ్‌సైట్‌లో హ్యాకర్లు ఓ మెస్సేజ్‌ పెట్టారు. ఉక్రెనియన్లారా.. మీ పర్సనల్ డేటా మొత్తం తొలగించాం. దాన్ని మీరు తిరిగి పొందలేరు. మున్ముందు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది జాగ్రత్త అని ఆ సందేశంలో ఉంది. మరి రష్యా సైబర్ ఎటాక్‌ను ఉక్రెయిన్‌ తట్టుకుంటుందా..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: