బండి సంజయ్‌ ఫిర్యాదుతో కేసీఆర్‌ కు షాక్‌ తప్పదా..?

Chakravarthi Kalyan
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ ను ఇటీవల జాగరణ దీక్ష సందర్భంగా అరెస్టు చేసి రెండు రోజులు జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెయిల్ పై బండి సంజయ్ బయటకు వచ్చారు. అయితే.. ఆరోజు బండి సంజయ్‌ను అరెస్టు చేసిన తీరుపై విమర్శలు వచ్చాయి. బండి సంజయ్ కార్యాలయ తలుపులు పగలగొట్టి మరీ అరెస్టు చేశారు. దీంతో తనపై దాడి జరిగిందని బండి సంజయ్‌.. పార్లమెంటరీ ప్రివిల్లేజ్ కమిటీకి లేఖ రాశారు.

ఆయన రాసిన లేఖపై ఇప్పుడు పార్లమెంటరీ ప్రివిల్లేజ్ కమిటీ విచారణ ప్రారంభించింది. బండి సంజయ్‌పై స్థానిక పోలీస్ కమిషనర్ అకారణంగా దాడి చేశారన్న ఫిర్యాదుపై పార్లమెంటరీ ప్రివిల్లేజ్ కమిటీ విచారణ ప్రారంభించింది. ఈ నెల 3వ తేదీన తన పార్లమెంటరీ కార్యాలయంలో పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన దాడి గురించి వ్యక్తిగతంగా స్టేట్మెంట్ ఇవ్వమని బండి సంజయ్‌ను పిలిచినట్లు తెలుస్తోంది.

ఈ నెల 21 వ తేదీన పార్లమెంట్ హౌజ్ లోని ప్రివిలేజ్ కమిటీ రూమ్ లో బండి సంజయ్ తన స్టేట్ మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎంపీ స్టేట్ మెంట్ తర్వాత ప్రివిలేజ్ కమిటీ పోలీస్ కమీషనర్ ను పిలిచి వివరణ కోరే అవకాశం ఉంది. అయితే ఈ ఘటనపై ఇప్పటికే బండి సంజయ్‌ తనకు కావలసినంత ప్రాచుర్యం పొందారు. ఈ అరెస్టు ఘటన కారణంగా ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హైదరాబాద్ వచ్చి.. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా శాంతి ర్యాలీలో పాల్గొన్నారు.

జేపీ నడ్డా మాత్రమే కాదు.. అనేక మంది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ వచ్చి అనేక కార్యక్రమాల్లో పాల్గొని బండి సంజయ్‌కు మద్దతు తెలిపారు. మొత్తానికి బండి సంజయ్‌ను ఇష్టారీతిన అరెస్టు చేసిన తెలంగాణ సర్కారు.. అందుకు తగిన విధంగా మూల్యం చెల్లించుకుంటోందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ అంశంపై స్థానిక పోలీసులు ఇచ్చే వివరణ ఎలా ఉంటుంది. అది ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: