రాజకీయ నాయకుల్లో పెరుగుతున్న నేరచరిత్ర.. ప్రక్షాళన ఎప్పుడో..!
ప్రస్తుత పార్లమెంటులో 83 శాతం మంది నేర చరిత్ర కలిగిన వారే ఉన్నారనేది ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, డబ్బున్న అరాచకవాదులు, ప్రజల మూలుగను జలగలా పీల్చే స్వార్థ పరులు ఇవ్వాల రాజకీయాలని ప్రధానంగా చేసుకొని చట్టసభల్లో కి అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు అనేక సందర్భాలలో మనము కళ్ళారా చూడవచ్చు.
చట్టసభల ప్రతినిధులు ఎలా ఉండాలి..!
చట్టసభలలో కి ఎంపికయ్యే ప్రతినిధులు ప్రజల కోసం పనిచేసే నీతిమంతులుగా సేవాతత్పరులు, త్యాగశీలురుగా ఉండాలనేది భారత రాజ్యాంగం ఆశించిన టువంటి ప్రాథమిక అంశం. ఈ అక్షర సత్యాన్ని అమలు చేయడానికి స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం తో పాటు న్యాయ సహాయాన్ని ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం తో పాటు న్యాయ వ్యవస్థ కూడా సిద్ధంగా ఉండాలో. ప్రతినిధుల ఎంపికకు సంబంధించిన అనేక సందర్భాలు న్యాయవ్యవస్థలో చర్చకు వచ్చినప్పుడు న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ఎన్నికల సంఘం ప్రజల కోణంలో గనుక అమలు చేస్తే ఇవాళ లోకసభ లో ఇ oత మంది నేరస్థులు ఉండేవారు కాదు.
చట్టసభల్లో నేరస్తులు ఉంటే తమ వర్గ ప్రయోజనానికి పాకులాడుతుంటారు కానీ ప్రజల కోసం కాదు. అవసరమైతే బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు, పేదలు, బహుజనులను పీడించడానికి సిద్ధపడి తమ ఆధిపత్యాన్ని చెలాయించడానికి ఇష్టపడతారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా అధికార పార్టీతో పాటు పలు రాజకీయ పార్టీలు చేసినటువంటి అవినీతి భాగోతాలను, లంచం ఇవ్వలేదని ప్రజలు రోడ్డెక్కి నటువంటి వైనాన్ని మనమంతా కళ్ళారా చూసినాము. కానీ ఎన్నికల సంఘం ఆ విషయంలో స్పందించకపోవడం చాలా బాధాకరం. అందుకే ఎన్నికల సంఘానికి చిత్తశుద్ధి అంకితభావం తో పాటు సంస్కరణ వాదం బలంగా ఉంటే తప్ప నీతివంతమైన రాజకీయాలను దేశంలో చూడలేము.