హ్యాపీ న్యూఇయర్ 2022 : అయ్యయ్యో! ముత్తంశెట్టి ఫీల్ అయ్యాడ్రా!
కొత్త ఏడాది ఎవరికి ఎలా ఉన్నా మన ముత్తంశెట్టి శ్రీనుకు మాత్రం అంతా మంచి జరిగేలానే ఉంది.అవంతి శ్రీనుగా పేరున్న ఆయన రాష్ట్ర మంత్రిగా మంచికి మంచి పంచికి పంచ్ అన్న విధంగానే ఉన్నారు. అసలు తిరుగులేని నాయకత్వానికి ప్రతినిధిగానే ఉన్నారు. తన గురువు గంటాను పార్టీలోకి రప్పించలేకపోయినా కూడా మంత్రి అవంతి హవాకు మాత్రం ఎక్కడా తిరుగులేకుండా ఉంది. ఇవన్నీ చెప్పుకునేందుకు, రాసుకునేందుకు బాగానే ఉన్నా మరోవైపు గ్రౌండ్ రియాల్టీ వేరేగా ఉందని తెలుస్తోంది. పర్యాటక శాఖను నిర్వహిస్తున్న అవంతి శ్రీను ఎన్నడూ లేనంత అసహనంతో ఊగిపోతున్నారు.
తన మాట తన జిల్లాలోనే నెగ్గడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఎదుట నిన్నటి వేళ వాపోయారు. విశాఖ నగరిలో జిల్లా అభివృద్ధి కి సంబంధించి నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి తన ఆవేదనను వ్యక్తం చేశారు. అధికారులెవ్వరూ తన మాట వినడం లేదని మరో మారు వాపోతూ అభివృద్ధి పనులు జరగడం లేదని చెబుతూ బాధపడ్డారు. ఆహా! ఇంతటి బాధ గతంలో ఎన్నడూ ఆయన ప్రదర్శించలేదు. ఎందుకనో ఆయన మాట నెగ్గడం లేదు అని నేరుగా చెప్పలేక ఇలా అంటున్నారా ఏంటి? ఎందుకంటే వైసీపీ సాయిరెడ్డి ఉంటుండగా టీడీపీ అవంతి శ్రీను మాట ఎలా నెగ్గుతుందని?