బాబోయ్ ఒమిక్రాన్: ఇండియాలో వెయ్యికి చేరువైన కేసులు..?
వివరాల్లోకి వెళ్తే.. దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో ప్రస్తుతం 263 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. అలాగే మహారాష్ట్రలో 252, గుజరాత్ 97, రాజస్థాన్ 69 ఒమిక్రాన్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆ తర్వాత స్థానాల్లో కేరళ 65 కేసులు, తెలంగాణ 62 ఒమిక్రాన్ కేసులు, రాజస్థాన్ 46 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. తమిళనాడులో 45, కర్ణాటక 34 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు కేంద్రం ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఇప్పటి వరకూ భారత్ లో నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో 320 మంది కోలుకున్నట్టు కేంద్రం చెబుతోంది. ఈ లెక్కలు పూర్తిగా విమానాశ్రయాల్లో జరిపిన టెస్టుల్లో వెల్లడైనవి మాత్రమే. విమానాశ్రయంలో పాజిటివ్ వచ్చిన వారి నమూనాలు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపుతున్నారు. అక్కడ ఒమిక్రాన్ అని తేలితే అప్పుడు ప్రకటిస్తున్నారు. ఆ తర్వాత వారి కాంటాక్టులకు కూడా టెస్టులు నిర్వహిస్తున్నారు. వారి నమూనాలు కూడా జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపుతున్నారు. ఈ పక్రియ కారణంగా ఒమిక్రాన్ కేసుల వెల్లడిలో జాప్యం జరుగుతోంది.
దీన్ని బట్టి కేంద్రం చెబుతున్నట్టు దేశంలో వెయ్యి వరకూ కరోనా కేసులు ఉన్నాయంటే.. లెక్కల్లోని రాని కేసులు దానికి కనీసం నాలుగింతలు ఉండే అవకాశం ఉంది. అందుకే వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ జోరందుకున్నాయి. ఈ జోరు ఇలాగే కొనసాగితే ఫిబ్రవరిలో ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఒమిక్రాన్ కేసుల లెక్కలు భయపెడుతున్నా.. ఎక్కువ మంది సురక్షితంగా పెద్దగా వ్యాధి లక్షణాలు లేకుండా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.