సీక్రెట్‌ ఔట్‌: ఒమిక్రాన్‌ విజృంభణకు ఇదిగో అసలు కారణం..?

Chakravarthi Kalyan
ఒమిక్రాన్‌.. ఇటీవల బాగా పాపులర్ అయిన పదం. కరోనా వైరస్‌లో వచ్చిన ఈ కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. గతంలోనూ కరోనా వైరస్‌లో అనేక వేరియంట్లు వచ్చాయి. అందులో కొన్నే ఎక్కువ ప్రభావం చూపించాయి. అలాంటి వాటిలో డెల్టా వేరియంట్ ఒకటి.. ఆ తర్వాత వెలుగు చూసిన ఈ ఒమిక్రాన్‌ ఏకంగా డెల్టాకు ఆరు రెట్లు వ్యాపిస్తూ కలకలం సృష్టిస్తోంది. అయితే.. అసలు ఒమిక్రాన్‌కు ఈ శక్తి ఎలా వచ్చింది..?

ఇప్పుడు ఈ అంశంపై పరిశోధనలు సాగుతున్నాయి. ఈ రహస్యం తెలిస్తే దీన్ని కట్టడి చేయవచ్చని భావిస్తున్నారు. అందులో భాగంగానే అధ్యయనాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ ఒమిక్రాన్‌కు రోగ నిరోధక శక్తిని ఏమార్చే సామర్థ్యం అధికంగా ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. కరోనా జన్యు క్రమాన్ని విశ్లేషించే కన్సార్షియం.. ఇన్సాకాగ్‌ ఈ విషయాన్ని బయటపెట్టింది.  ఈ విషయాన్ని రూఢీ చేసే ప్రయోగాత్మక, క్లినికల్ డేటా ఉన్నట్లు ఇన్సాకాగ్‌ వివరించింది.

ఈ ఒమిక్రాన్ టీకా సామర్థ్యాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తోందట. రోగనిరోధక శక్తిని ఏమార్పడం.. టీకా శక్తిని తగ్గించడం వంటి కారణాలతో ఈ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తున్నట్టు ఇన్సాకాగ్‌ ఓ అంచనాకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న తీరును గ్లోబల్ డేటా ఆధారంగా పరిశీలించి ఈ అంచనాకు వచ్చారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి ఈ రెండు లక్షణాలు ప్రధాన కారణాలని గుర్తించారు.

అయితే.. కాస్త ఊరట కలిగించే విషయం ఏంటంటే..  డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ వల్ల వచ్చే  వ్యాధి తీవ్రత, లక్షణాలు తక్కువగా ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా ఇన్సాకాగ్ ధ్రువీకరించింది. ఇంకో విషయాన్ని కూడా ఇన్సాకాగ్ చెబుతోంది. ఓవైపు ఒమిక్రాన్ విస్తరిస్తున్నా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ డెల్టా ఆందోళనకర వేరియంట్‌గానే కొనసాగుతోందట. అంటే ఒమిక్రాన్ వచ్చినా డెల్టా జోరు మాత్రం తగ్గలేదట. అసలు విలన్‌ డెల్టాయే అన్న వాదన కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: