జగనన్న : ఏపీలో రోడ్లు బాగు ఎప్పుడంటే?
ప్రతిసారీ రోడ్డు పనులపై
అధికారులు చెప్పే మాట ఒక్కటే
ఆ నెపం వాన దేవుడిపై నెట్టేయడమే
ఆ విధంగా తప్పుకు తిరిగి
విలువయిన ప్రాణాలను కాపాడాల్సిన
బాధ్యత విస్మరించడమే విషాదకరం
రహదారి పనులు నిర్వహించాలంటే
నిధులు కావాలి కానీ ఈ ప్రభుత్వానికి ఆ చొరవ కానీ
ఆ వ్యయాన్ని భరించదగ్గ ఆర్థిక బలం కానీ లేవని
ఎప్పుడో తేలిపోయింది...?
రోడ్లు బాగాలేకపోయినా గుంతలు ఏర్పడి ప్రమాదాల బారిన పడుతున్నా పట్టించుకునే తీరిక ప్రభుత్వానికి లేదన్న జనసేన విమర్శకు వైసీపీ తన పనితనంతో కౌంటర్ ఇవ్వాలి. ఒక కిలోమీటరు పరిధిలో కూడా కొత్త రోడ్డు వేయలేక, పాత రోడ్డు బాగు చేయలేక జగన్ ప్రభుత్వం అభాసుపాలవుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు చెప్పే సాకులు మరీ హాస్యాస్పదంగా ఉన్నాయి.
ఆ వివరం ఈ కథనంలో...
ఆ ప్రశ్నకు సమాధానం లేదు?
రెండు వేల కోట్ల రూపాయలతో రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించామని పనులు చేపట్టడమే తరువాయి అని అప్పుడెప్పుడో సీఎం జగన్ చెప్పారు. రాష్ట్రంలో రోడ్ల అస్తవ్యస్తతపై జనసేన సామాజిక మాధ్యమాల్లో ఉద్యమించిన తరువాత జగన్ స్పందించి తన నిర్ణయాన్ని వెలువరించిన దాఖలా ఒకటి విధితమే! అయితే ఇప్పుడు వానలు ఉన్న కారణంగానే పనులు చేపట్టలేకపోయామని గౌరవ అధికారులు తేల్చేశారు. మరి! కిలోమీటరు దూరంలో వందకు పైగా గోతులున్న రోడ్లపై జనం ఎలా ప్రయాణిస్తారని? పైకి పోతున్న ప్రాణాలకు ఎవరు బాధ్యత? అని అడిగితే దానికి మాత్రం సమాధానం జగన్ మోహన్ రెడ్డి దగ్గర లేదు.
ఈ తరుణంలో ఈ నేపథ్యంలో.....
ఆంధ్రావనిలో రోడ్లు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఎప్పుడు ఇవి మరమ్మతులకు నోచుకుంటాయో కూడా తెలియకుండా ఉంది. అయితే తాము డిసెంబర్ మొదటివారంలోనే పనులు ప్రారంభించాలని చూశామని కానీ పనులు ఆలస్యం అయ్యాయని,ఇందుకు వర్షాలే కారణమని అంటున్నారు ఉన్నతాధికారులు. అయితే సాధారణ మరమ్మతులు ఫిబ్రవరి నెలాఖరుకు, అత్యవసర
మరమ్మతులు మార్చి నెలాఖరుకు, ప్రత్యేక మరమ్మతులు జూన్ నెలాఖరుకు పూర్తి చేస్తామని అంటున్నారు. అయితే రోడ్ల అధ్వాన స్థితిపై ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి మీడియా తీసుకువెళ్తున్నా నిధుల లేమి కారణంగా ఎక్కడా ఏ పనులూ జరగడం లేదు అన్నది ఓ వాస్తవం.