Jagan @ 49 : సొంత మనుషుల నుంచే నిరసనలా?
తప్పు ఎవరిదైనా తప్పే కానీ అది ఎన్నటికీ ఒప్పయిపోదు. వైసీపీలో కూడా ఇప్పుడు ఒంగోలు గూండాగిరీపై తీవ్ర స్థాయిలో దుమారం రేగుతోంది. సుబ్బారావు గుప్తా అనే ఆర్య వైశ్యుడ్ని కొట్టించేందుకు వైసీపీ గూండాలు పోలీసు జీపులో వెళ్లాడని ప్రధాన మీడియాలో వార్తలు వస్తున్నందున వీటిపై పూర్తి విచారణ చేయాలని కూడా సొంత మనుషులే డిమాండ్ చేస్తున్నారు.
మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు సుభానీని అరెస్టు చేయాలని డిమాండ్ ఒకటి బలంగానే వినిపిస్తుంది వైసీపీలో..ఈ మేరకు చాలా మంది సుభానీ చర్యకు మద్దతివ్వడం లేదు. అదేవిధంగా ఆయనకు చెక్ పెట్టాల్సింది కూడా మంత్రేనని పలువురు వైసీపీ అభిమానులు అంటున్నారు. ఒక అధికార పార్టీ కార్యకర్త ప్రాణానికే రక్షణ లేకపోతే ఇక రాష్ట్రంలో సామాన్యుల గతేం కావాలని వారంతా ప్రశ్నిస్తున్నారు. సుబ్బారావు గుప్త అనే ఓ కార్యకర్త ఎప్పటి నుంచో పార్టీకి సేవలు అందిస్తున్నారని, ఆయన మాటల్లో ఎటువంటి తప్పిదం లేదనే అంటున్నారు. బూతులు మాట్లాడే మంత్రులను వదిలి తప్పని చెప్పిన వారిని నరికేస్తాం అంటూ బెదిరించడం మంత్రి హోదాలో ఉంటూ కూడా రెండ్రోజులుగా సాగుతున్న ఎపిసోడ్ ను నిలువరించకపోవడం బాధాకరమని పేర్కొంటున్నారు.