క్రాష్ : సెలవిక కెప్టెన్ ! వి మిస్ యూ!
నిన్నమొన్నటి వరకూ మృత్యువుతో పోరాడిన కెప్టెన్ ఇప్పుడిక లేరు. ఇలా చెప్పడంలో మన విషాదం స్థాయి పెంచుకోవడం తప్ప భగవంతుని ఆదేశాలను ధిక్కరించగలమా! వరుణ్ సింగ్ అనే కెప్టెన్ మన మధ్య లేరు.. వరుణ్ సింగ్ అనే సాహసి మన మధ్య లేరు అని రాయడంలో ఏమయినా అర్థం ఉందా.. వీరుడెక్కడికి వెళ్తాడు..మన మధ్యలోనే ఉంటాడు. కనుక ఆయన లేరు లేదా రారు అని చెప్పడం అబద్ధం అవుతుంది. మరణం కూడా అబద్ధమే నిజం ఏంటంటే ఓ వ్యక్తి మన మధ్య మన శక్తికీ మన తాపత్రయానికీ కారణం అయి ఉండడమే నిజం. ఆ విధంగా వరుణ్ సింగ్ మన మధ్యే ఉంటారు.. మన నేల నవ్వితే పచ్చందనాలు పూసుకుని నవ్వితే ఆయనే ఉంటారు. ఈ సంక్రాంతి వేళల్లో మన మధ్యే ఉంటారు. మన పండుగ వారే చేసుకుని మనతోనే ఆనందాలు పంచుకుంటారు. వరుణ్ సింగ్ కానీ లేదా బిపిన్ రావత్ కానీ సాయి తేజ కానీ ఎక్కడికీ వెళ్లరు. వారు ఈదేశం నుంచి వెళ్లడంలో అర్థం లేదు. మన సాహసం ఇంకా చెప్పాలంటే మనం మననం చేసుకోదగ్గ సాహసం నుంచి వారు గొప్ప సందేశం ఇచ్చి వెళ్లి ఉంటారు.. వాటిని చదువుకుని తీరడం బాధ్యత. డిసెంబర్ 8న జరిగిన ఎంఐ-17 హెలీకాప్టర్ ప్రమాదం జరగకుండా ఉంటే బాగుండేది. నీలగిరి కొండల దగ్గర క్రాష్ జరగకుండా ఉంటే బాగుండేది. ఈ దేశం ఒకరిని కాదు ఇద్దరిని కాదు వరుణ్ సింగ్ తో సహా ఓ ఘోరకలి ఏడాది చివరి విషాదంలో 14 మంది వీరులను వారి సాహసాలను ధైర్య పరాక్రమాలను శౌర్య గుణాలను పోగొట్టుకుని కన్నీరు మున్నీరవుతున్న సందర్భమే ఇది. వెళ్లిపోతూ వెళ్లిపోతూ ఏడాది మిగిల్చిన విషాదంలో మనం ఒక గొప్ప పాఠం నేర్చుకోవాలి. వీరుడికి ప్రత్యామ్నాయం వెతకడం తప్పు అని తెలుసుకోవాలి.. కొత్త శక్తుల పుట్టుక ఈ నేల నుంచి ఆ నింగి వరకూ విస్తరించి ఉంటుంది అని ఈ దేశ పెద్దలు తప్పక తెలుసుకుని భగవంతుని ఆదేశానుసారం మంచి బుద్ధితో పాలన చేయగలగాలి. వీరుడికి ఇచ్చే నివాళికి అర్థం దేశం మరియు నేను బాధ్యతగా ఉండడమే! మృత్యువుతో పోరాడడంలో వరుణ్ సింగ్ కడదాకా ఉన్నారు. కడదాకా ధైర్యం మరియు సాహసం అన్నవి వదులుకోకుండా ఉన్నారు. కనుక వారికి మనం ఇచ్చే నివాళి కష్ట కాలంలో ధైర్యం మరియు సాహసం వదులుకోకుండా ఉండడం.
బెంగళూరు మిలటరీ ఆస్పత్రిలో మృత్యువును జయిస్తారని వరుణ్ సింగ్ తిరిగి వస్తారని భావించిన దేశానికి ఓ విషాద వార్త వచ్చింది. తెలియ వచ్చింది. వెలుగు చూసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచిన ఘట్టం ఒకటి దేశం అంతటా వ్యాప్తి చెందింది.. మరణ ఛాయలు ఉన్నా కూడా వీరుడు మాత్రం ఎన్నడూ వెన్ను చూపడు. మరణ ఛాయలు ఆవహించినా కూడా వీరుడు ఎన్నడూ వెనుదిరిగి చూడడు. కనుక దేశం యావత్తూ చెప్పే మాటలకూ నివాళులకూ సిసలు అర్థం ఆ వైమానిక దళం చెప్పే మాటలకు సిసలు అర్థం ప్రతి మనిషీ తమ జీవితాన్ని ఇతరుల కోసం కేటాయించేందుకు సమయం వెచ్చించడం.. ఇలాంటి దారుల్లో ఇలాంటి సందర్భాల్లో మాత్రమే మనుషులు కాస్తయినా ఏకమై ఆలోచిస్తే మరణానికి ఓ స్వచ్ఛమయిన అర్థం, త్యాగానికి ఓ స్వచ్ఛమయిన అర్థం తప్పక దొరుకుతుంది. కనుక మనం మరణానికి అర్థం వెతికితే ఈ దేశం మనకు ఇచ్చిన లేదా అప్పజెప్పిన బాధ్యత లేదా సమూహ బాధ్యత ఒకటి తప్పక గుర్తుకువస్తుంది. నా సైనికుడి పద ఘట్టనలు వినిపించి కొత్త ఉత్తేజం ఇచ్చి పంపుతాయి.. వెళ్లిపోతున్నారు అని అనుకుంటున్న వీరులంతా ఇక్కడే నెత్తుటి ధారల చెంత చైతన్య జ్వాలల చెంత వికసించి ఉంటారు.. నినదించి ఉంటారు.. వారికి నివాళి చెప్పడంలో బాధ్యత.. వారు ఈ దేశానికి చేసిన సేవ ఓ స్మరణ.. అందుకు కారణం అయిన నేల దాని రక్షణ మనందరికీ ఓ గొప్ప పరిరక్షణ కారకం. కనుక నేలలో కలిసిపోవడం నింగిలో కలిసిపోవడం అన్నవి జరగని పనులు.. వాళ్లు మన గాలుల్లో మన దారుల్లో నిరంతరం ఉంటూనే ఉంటారు అన్న స్మరణ చిరస్మరణీయం. సర్ మీకు నేను వందనాలు చెల్లిస్తున్నాను.. మీ తల్లిదండ్రులకు మీ నేలకు వందనాలు చెల్లించకుండా ఉండలేను నేను.. హ్యాట్సాఫ్ సర్.. మీతో పాటు ఇంకొందరు కూడా! మీ నేలతో రుణం తీరిపోయిందని అస్సలు అనుకోవద్దు..అది తప్పు! వీరుల జీవితం రేపటి చరిత్రలో వినిపించే స్వరం అయి ఉంటుంది..కనుక ఆ చిరాయువుకు ఇదే కడసారి కన్నీటి వందనం...
- రత్నకిశోర్ శంభుమహంతి