ఉద్యోగుల స్థానికతకు పెను ప్రమాదం..! ఎందుకంటే..?

N ANJANEYULU
తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఇటీవ‌ల ఉద్యోగుల స్థానిక‌త‌పై ఓ జీవోను విడుద‌ల చేసిన విష‌యం విధిత‌మే. ముఖ్యంగా  జోన‌ల్ విధానం మూలంగా ఆయా సొంత జిల్లాల‌లోనే ఉద్యోగం క‌ల్పించే విధంగా ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు ప్రారంభించింది. కొన్ని జిల్లాల‌లో ఎన్నిక‌ల కోడ్ ఉన్నందున ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ఆ ప్ర‌క్రియ‌ను ప్రారంభించ‌నున్న‌ది. తెలంగాణ ప్ర‌భుత్వం జారీ చేసి జీవో నెంబ‌ర్ 317పై ప్ర‌తిప‌క్ష‌నాయ‌కులు ప‌లు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఆ జీవోపై తీవ్ర అభ్య‌త‌ర‌మే వ్య‌క్తం చేసారు. ప్ర‌భుత్వం జారీ చేసిన 317 ఉత్త‌ర్వుల‌తో ఉద్యోగుల స్థానిక‌త‌కు పెను ప్ర‌మాద‌మే ఏర్ప‌డింద‌ని పేర్కొన్నారు బండి సంజ‌య్‌. ముఖ్య‌మంత్రి కేసీఆర్ తుగ్ల‌క్ పాల‌న‌కు ఇది నిద‌ర్శ‌నం అని మండిప‌డ్డారు సంజ‌య్‌. స్థానికులైన ఉద్యోగులు జోన‌ల్ విధానంలో ఇత‌ర  జిల్లాల‌కు వెళ్లాల్సిన ప‌రిస్తితి ఏర్ప‌డిన‌ద‌ని గుర్తు చేసారు. ముఖ్యంగా సీనియ‌ర్‌, జూనియ‌ర్ పేరుతో సీఎం కేసీఆర్ ఉద్యోగుల‌లో చీలిక తీసుకొస్తూ రాజ‌కీయ ల‌బ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నారు అని విమ‌ర్శించారు బండి సంజ‌య్‌.

ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్లు ద‌క్క‌కుండా.. ఇత‌ర స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న త‌రుణంలోనే ఉద్యోగుల‌ను మ‌రింత ఇబ్బంది పెట్టేవిధంగా సీఎం కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పేర్కొన్నారు బండి.  ముఖ్యంగా రాష్ట్రంలో పాత స‌మ‌స్య‌ల‌ను దారి మ‌ళ్లించేందుకు ఎప్ప‌టిక‌ప్పుడూ కొత్త స‌మ‌స్య‌ల‌ను తెర‌మీద‌కు తీసుకొస్తూ రాజ‌కీయంగా ప‌బ్బం గ‌డుపుకోవ‌డం సీఎం కు అల‌వాటుగా మారింద‌ని బండి సంజ‌య్ చెప్పారు.

ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయ‌ల‌ను క‌మీష‌న్లుగా దండుకున్నారు సీఎం కేసీఆర్ అని మండిప‌డ్డారు. ఆ డ‌బ్బుతో ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను దాచి పెట్టి.. త‌న‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడే వాటిని బ‌య‌టకు తీస్తూ రాజ‌కీయ డ్రామాలు ఆడుతూ.. గంద‌ర‌గోళం సృష్టిస్తున్నార‌ని బండి సంజ‌య్ ఆరోపించారు. ఉపాధ్యాయ‌, ఉద్యోగుల్లో తీవ్ర గంద‌ర‌గోళ సృష్టిస్తున్న ఆ జీవో అమ‌లును త‌క్ష‌ణ‌మే నిలిపివేయాల‌ని..  ఆ త‌రువాత‌నే జిల్లాల వారిగా ఉద్యోగుల కేటాయింపు చేప‌ట్టాల‌న్నారు. అదేవిధంగా రాష్ట్రప‌తి ఉత్త‌ర్వుల స్పూర్తిని కూడా దెబ్బ‌తీయ‌కుండా నిర్ణ‌యం తీసుకోవాల‌ని బండి సంజ‌య్ సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: