OTS విషయంలో క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..!
వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్ పై పలు ప్రాంతాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న కారణంగా పార్టీ శ్రేణులకు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక సూచనలు చేశారు. వైసీపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటీఎస్ పై లబ్ధిదారుల్లో అవగాహన కల్పించాలని.. ఇది స్వచ్ఛంద పథకమన్నారు. ఇందులో బలవంతం ఏమీ లేదన్నారు. ఓటీఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తే పేదలకు ఎంతో మేలన్నారు. అందుకే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు సజ్జల.
ఓటీఎస్ వల్ల పేదలకు ఎలాంటి నష్టం ఉండదన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఓటీఎస్ పై ప్రజలు సహాయ నిరాకరణ చేయాలని చంద్రబాబు కోరడం సరికాదన్నారు. ఓటీఎస్ తో ప్రభుత్వానికి వచ్చేది కేవలం 4వేల కోట్ల రూపాయలన్నారు. నామమాత్రపు రుసుముతో రిజిస్ట్రేషన్ చేసి సర్వహక్కులు కల్పిస్తున్నామన్నారు. పంచాయతీల్లో ఇంటికి 10వేల రూపాయలు, మున్సిపాలిటీల్లో 15వేల రూపాయలు, కార్పొరేషన్లలో 20వేల రూపాయలు తీసుకుంటున్నట్టు చెప్పారు సజ్జల.
అయితే తప్పనిసరంటూనే ఓటీఎస్ సొమ్ముకోసం ప్రజలపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఓటీఎస్ పేదల మెడకు ఉరితాడుగా మరుతోందన్నారు. ఇప్పుడున్న సీఎం.. భూమి, రుణం నిర్మాణ ఖర్చులు ఇచ్చారా..? ఎన్టీఆర్ కట్టించిన ఇళ్లకు ఇప్పుడు వసూలు చేస్తారా..? ఇంటి రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్.. మాట తప్పి, మడమ తిప్పారు. గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్లు కూడా చట్ట విరుద్ధమే అని ఆయన అన్నారు. చూద్దాం.. సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో.