ఏపీలో పంట నష్టం... కేంద్రం సాయం చేసేనా...!

Podili Ravindranath
దాదాపు నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణీ ప్రభావంతో...  గతంలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమ ప్రాంతం వరద నీటిలో చిక్కుకుంది. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు వరద తాకిడికి చిగురుటాకులా వణికిపోయాయి. ఒక్క కడప జిల్లాలోనే దాదాపు 50 మంది వరకు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇక చిత్తూరు జిల్లాలోని చెరువులకు గండ్లు పడటంతో... గ్రామాలు నీటిలో నానిపోయాయి. కడప జిల్లాలోని పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు పారడంతో.. రాజంపేట ప్రాంతానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కూడా తెగిపోయాయి. పెన్నా, స్వర్ణముఖి నదులు ఉప్పొంగాయి. జాతీయ రహదారులు కోతకు గురయ్యాయి. రైల్వే ట్రాకులు వరద నీటికి కొట్టుకుపోయాయి. ఇక తిరుపతి పట్టణ ప్రజలు మూడు రోజుల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీశారు. తిరుమలకు వెళ్లే అన్ని మార్గాలను కూడా అధికారులు మూసివేశారు. ఘాట్ రోడ్డుపై కొండ చరియలు విరిగిపడ్డాయి.
భారీ వర్షాలు, వరదల కారణంగా ఏపీలో రైతులు ఊహించని విధంగా నష్టపోయారు. ఇప్పటికే దాదాపు 3 వేల 300 కోట్ల రూపాయల మేర పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం ఒక్క నవంబర్ నెలలో కురిసిన వానలకు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో మొత్తం 13 లక్షల 24 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇక ఈ ఏడాది జూన్ నెల నుంచి అక్టోబర్ వరకు జరిగిన నష్టం కూడా భారీగానే ఉంది. కుండపోత వర్షాలకు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో లక్షల ఎకరాల్లో పంట చివరికి పశువుల మేతకు కూడా  పనికిరాకుండా పోయింది. ఇదే సమయంలో సకాలం వర్షాలు పడక కర్నూలు జిల్లాలో పంట దెబ్బతింది. అటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో గులాబ్ తుఫాను కారణంగా వరితో పాటు... ఇతర వాణిజ్య పంటలకు కూడా  తీవ్ర నష్టం జరిగినట్లు నివేదికలో వెల్లడైంది. రాష్ట్రంలో దాదాపు 6 లక్షల పైగా ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. రబీలో ప్రధాన పంట సెనక కూడా నవంబర్ నెలలో కురిసిన వర్షాలకు నానిపోయి కుళ్లిపోయింది. వరి రైతులకు ఎకరాకు దాదాపు 40 వేల వరకు పెట్టుబడి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: