అమితా షా ఆదేశాలతో ఏపీలో వలస నేతలకు కమలదళం ఆహ్వానాలు పంపుతోందా..? ఏపీలో ఎలాగైనా బలపడేందుకు వ్యూహ ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మొన్నటి వరకు ఒకరితో ఒకరు అంటీ ముట్టనట్లుగా నెట్టుకొస్తున్న ముఖ్యనేతలంతా ఒక్కటై క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణకు కసరత్తు చేస్తున్నారు. కేంద్ర పెద్దల ఆదేశాలతో సోము వీర్రాజు నేతృత్వంలో ఏపీలో పాగా వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న కమల దళం తాజాగా చేరికలకు ముహూర్తం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. తిరుపతి వేదికగా జరిగిన సమావేశంలో పార్టీ నేతలకు అమిత్ షా క్లాస్ తీసుకోవడంతో ఇకపై పార్టీని గాడిలో పెట్టాలని సీనియర్లకు షా వార్నింగ్ ఇవ్వడంతో ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం కోసం సోము సిద్ధమయ్యారట.
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన నాటి నుంచి నెలకొన్న రాజకీయ పరిణామాలతో ఏపీ బిజెపి నేతలు తమకేమీ పట్టనట్లుగా ఉంటున్నారన్న విషయం కేంద్ర పార్టీ గుర్తించిందట. అయితే ప్రక్షాళన కోసం త్వరలో బిజెపి ప్రత్యేకంగా సమావేశం అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏపీలో బీజేపీ అడుగులు ఎలా ఉండబోతున్నాయన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున నడుస్తోంది. యూపీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో బిజెపిలో పెద్దఎత్తున వలస నేతలకు పెద్దపీట వేసి అధికారంలోకి వచ్చిన కమల నాథులు శివ ప్రకాష్ జీ ద్వారా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారట. అలా ఏపీపై ఫోకస్ పెట్టిందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే అమిత్షా ఆదేశాలకు అనుగుణంగా బిజెపిలో ఇతర పార్టీల నేతల చేరికలపై ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు నేతలు. ఇప్పటికే ప్రజా సమస్యల విషయంలో కార్యాచరణ సిద్ధం చేయడంతో పాటు అమరావతి రాజధాని, ఏపీలో ఆర్థిక సమస్యలు, ఉద్యోగులు పరిపాలనాపరమైన అంశాలపై శివ ప్రకాష్ జీ దిశానిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం. మొత్తానికి ఏపీలో బలపడేందుకు వ్యూహాలు రచిస్తున్న కమలనాథులు రాబోయే రోజుల్లో ఏ మేరకు ప్రభావం చూపిస్తారో వేచి చూడాలి.