ఫ్యాన్ ఆంధ్రా : జగన్ భజనలో జేడీ?
ఆంధ్రావనిలో నాడు నేడు పథకం బాగుందని కితాబిచ్చారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. అదేవిధంగా పీహెచ్‌సీల అభివృద్ధికి నిధులు కేటాయించారని కూడా ప్రశంసించారు. ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో! ఇదే సమయంలో ఓ విషయం ప్రస్తావించాలి. ఆ రోజు అక్రమాస్తుల కేసులో జగన్ ను ముప్పుతిప్పలు పెట్టిన జేడీ తరువాత కాలంలో ఆ కేసు గురించి మాట్లాడలేదు. ఏమంటే ఆ తగువు కోర్టు పరిధిలోఉందనే అంటారు. 2019 లో ఎన్నికల సమయంలో తనను అన్ని పార్టీల నాయకులూ సంప్రదించారని అంటారు. అప్పుడు వైసీపీ కూడా వచ్చిందని కూడా చెప్పారు. అంటే ఆ రోజు ఆ కేసు కేవలం కొందరి ఉద్దేశాలను అనుసరించి నమోదయిందని, ఇప్పుడు వాటికీ తనకూ ఏ సంబంధం లేదని స్పష్టం చేసి తప్పుకున్నట్లేగా! ఈ విధంగా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ రోజు ఆయన ఆ కేసు విషయమై నడుచుకున్నారన్నది సుస్పష్టం. ఓ రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నా లేదా సొంత శక్తి లేనప్పుడు వేరే పార్టీలో చేరాలనుకున్నా అదంతా ఆయన వ్యక్తిగతమే అయినప్పటికీ, జగన్ విషయమై ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఆయన ఏమీ మాట్లాడడం లేదు. ఏమై ఉంటుంది?
వాస్తవానికి ఆయనను చంద్రబాబు ఏజెంట్ అని అంటారు. ఇది కూడా విమర్శే! ఆ రోజు సోనియా, చంద్రబాబు కలిసి నడిపిన డ్రామా అని కూడా అంటారు. అలాంటప్పుడు అది డ్రామా కాదు నేను నడుచుకున్నదంతా ధర్మం ప్రకారమే అని చెప్పొచ్చుగా! అవేవీ చెప్పరు కానీ వాటి విషయాలు అన్నీ కోర్టుకు చెప్పానని ఇక తనకూ రాజకీయ పార్టీలకూ ఏ సంబంధం లేదని మాత్రం అంటారు. ఉద్యోగ జీవితం నుంచి విరమించుకున్నాకే తాను రాజకీయాల్లోకి రావాలనుకున్నానని మాత్రం చెబుతారు. ఏదేమైనప్పటికీ జనసేనతో మళ్లీ చర్చించేందుకు సిద్ధమేనని కూడా అన్నారు. కానీ ఎక్కడా వైసీపీని కానీ టీడీపీని కానీ ఆయన పల్లెత్తు మాట అనలేదు. స్టీలు ప్లాంటు ఉద్యమానికి మాత్రం తాను మద్దతిస్తున్నానని, క్షేత్ర స్థాయిలో ఉద్యోగులతోనూ, అదేవిధంగా విద్యార్థులతోనూ మాట్లాడుతున్నానని చెప్పారు.