రాయల సీమను కేంద్రం ఆదుకుంటుందా..?

Chakravarthi Kalyan
రాయలసీమ జిల్లాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు.. ఆ ప్రాంతాన్ని దారుణంగా దెబ్బతీశాయి. చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు విశ్వరూపం చూపించాయి. ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం అనేక గ్రామాల్లో విషాదం నింపింది. ఇళ్లకు ఇళ్లే కొట్టుకుపోయి.. మనుషులు సైతం గల్లంతై పెను విషాదానికి కారణమైంది. వరద బాధితులను ఆదుకుంటామని ఇప్పటికే జగన్ సర్కారు ప్రకటన చేసింది. అంతే కాదు.. ఈ వరద బాధితులను కేంద్రం కూడా ఆదుకోవాలంటూ జగన్ ప్రధాని, కేంద్ర హోంమంత్రిలకు లేఖలు రాశారు.

జగన్ రాసిన లేఖల ఫలితంగా రాష్ట్రానికి కేంద్ర బృందాలు పర్యటన కోసం వచ్చాయి. వరద నష్టం అంచనా కోసం రాష్ట్రంలో పర్యటిస్తున్నాయి. సీఎం లేఖ మేరకు బృందాన్ని పంపింది కేంద్ర హోంశాఖ. ఈ కేంద్ర బందాలు రెండుగా విడిపోయి పర్యటిస్తున్నారు. మొత్తం రాష్ట్రంలో ఏడుగురు సభ్యులు పర్యటిస్తున్నారు. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో వీరి పర్యటన ఉంటుంది. కేంద్ర హోంశాఖ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలో పర్యటన సాగుతోంది. మొత్తం రాష్ట్రంలో 3 రోజులపాటు పర్యటింటిస్తారు.

నిన్న చిత్తూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది. ఇవాళ చిత్తూరు, కడప జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన ఉంటుంది. ఈ నెల 28న నెల్లూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటిస్తుంది.  పర్యటన అనంతరం ఈ నెల 29న సీఎం జగన్‌తో ఈ కేంద్ర బృందం భేటీ అవుతుంది. అయితే ఈ కేంద్ర బృందాల పర్యటన ఎంత వరకూ వరద బాధితులను ఆదుకుంటుందనేది చూడాలి. ఏపీ సర్కారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున ఇతోధికంగా సాయపడటం కాస్త కష్టమే. అయితే జగన్ సర్కారు మాత్రం రెండు రోజుల్లోనే వరద బాధితులకు స్వల్పంగానైనా సాయం చేశామని చెబుతోంది.

గతంలో ఎన్నడూ ఇంత త్వరగా సాయం అందలేదని.. అలాంటి తమపై విమర్శలు చేయడమేంటని వాదిస్తోంది. వరద సాయం విషయంలో వాదనల కంటే.. సాయమే ప్రధానం. స్వరం కోల్పోయిన వారిని ఆదుకోకపోతే.. ఇక ఈ ప్రభుత్వాలెందుకన్న నిస్పృహ ప్రజలకు కలగడం మంచిది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: