ఢిల్లీలో ఆ నాలుగు రోజులు కేసీఆర్ ఉండటం.. వ్యూహమేనా..!

MOHAN BABU
అంతన్నారు,ఇంతన్నారు తాడో పేడో తేల్చుకుంటానన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై యుద్ధం చేస్తానన్నారు. తెలంగాణ ఉద్యమ గర్జన చూపిస్తానంటూ ఢిల్లీ మెట్లు ఎక్కారు. తీరా చూస్తే నాలుగు రోజులు మకాం వేసిఎవరినీ కలవకుండానే తిరిగి హైదరాబాద్ వచ్చారు. అసలు ఏం చెప్పి వెళ్లారు?  ఏం చేసి వచ్చారు? యాసంగి లో వరి సాగు పై కేంద్రంతో ఏదో ఒకటి తేల్చుకొని వస్తానని ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ కు ఎదురుచూపులు తప్పలేదు. హస్తిన పర్యటన లో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కే పరిమితమయ్యారు. అయితే ప్రధాని,కేంద్ర మంత్రులు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కారణంగాసమయం ఇవ్వలేదని బీజేపీ నేతలు చెబుతుంటే బుధవారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఎలా కలిశారని టీఆర్ఎస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం హస్తిన చేరుకున్న సీఎం కేసీఆర్  తుగ్లక్ రోడ్ 23 లోని సీఎం అధికార నివాసంలో విశ్రాంతి తీసుకున్నారు. సోమవారం రోజు ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్రమంత్రులు అపాయింట్మెంట్  కోసం ప్రయత్నించారు. మంగళవారం నాటికి కూడా అపాయింట్మెంట్ పై  ప్రధాని ఆఫీస్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు.

 ఇక బుధవారం సైతం ప్రధానిని కలవడం కష్టమేనని అంచనాకు వచ్చిన సీఎం కెసిఆర్ ఆ సాయంత్రం హైదరాబాద్ బాట పట్టారు. దీంతో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన పై ప్రతిపక్ష పార్టీలు సెటైర్లు వేస్తున్నాయి. బిజెపి సీఎం కేసీఆర్ కలిసి డ్రామాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగానే కేంద్ర మంత్రులు సీఎం కేసీఆర్ ను కలవలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అంతేకాక సీఎం హస్తిన పర్యటన వల్ల ఢిల్లీ తెలంగాణ భవన్ లో బిల్లులు రెట్టింపు అవ్వడం తప్ప మరో ప్రయోజనం ఉండదని ఆరోపిస్తున్నారు. రోడ్లమీద ఆరబెట్టిన వరి ధాన్యం మొలకలెత్తి మరోసారి కాపుకు వచ్చే సమయం వరకు కెసిఆర్, కేంద్ర ప్రభుత్వం ఇలాగే డ్రామాలాడుతారని అంటున్నారు. మొత్తానికి ధాన్యం సేకరణ అంశంముగిసిన అధ్యయనం అని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: