పబ్లిక్ సెటైర్ : అబ్బే! కట్నమేమీ వద్దండి నాలుగు టమాటాలు చాలు!
అదేలేండి పడుకుంటాయి
అనగా నిద్రను నటిస్తాయి లేండి
ధరలు పరుగులు తీస్తాయి
నిద్ర తీరాక పాలక వర్గాలు
ధరల నియంత్రణ పేరిట
చేసే హడావుడి ఓ నాటకం
అంతకుమించి ఏం కాదు!
టమాట అంటే మాటలా అని జోక్స్ వేసుకోవడం తప్ప ఇప్పుడు చేయదగ్గది ఏమీ లేదు. అవును బహిరంగ మార్కెట్లో ధరల నియంత్రణపై ఇప్పటికీ ప్రభుత్వానికో కనీస స్థాయి ఆలోచన కానీ సంబంధిత ప్రణాళిక కానీ లేదు. దీంతో పంటలు బాగా పండితే రేటు గిట్టుబాటు కాక పారబోసే రైతులు కొందరైతే, ధరలు ఉన్నప్పుడు కాస్తో కూస్తో దళారీలను నమ్ముకుని అంతో ఇంతో లాభం చూసేవారు కొందరు. ఇవి మినహా వినియోగదారుడి క్షేమం కోరి వాడి దృష్ట్యా వ్యాపారం సాగిస్తున్న వారే అరుదు. అందుకే రిలయెన్స్ ఫ్రెష్ లకు అంతంత లాభాలు. ఇప్పుడే కాదు గతంలో కూడా ఈ విధంగానే రేట్లు కార్తీక వేళల్లో చుక్కలు చూపించాయి. అయినా కూడా ధరలు పెరిగిన ప్రతిసారీ వ్యంగోక్తులు (సెటైరికల్ వెర్షన్) వినిపించడం మినహా వినియోగదారులు ఈ ఆటలో నిమిత్త మాత్రులు. పొరుగు రాష్ట్రం తమిళ నాడు తన పరిధిలో ధరల నియంత్రణకు కాస్తో కూస్తో చర్యలు తీసుకుంటోంది ఫలితంగా అక్కడ కేజీ టమాటా 76 రూపాయలకే పలుకుతోంది. కానీ ఇక్కడ విజయనగరం మార్కెట్లో కేజీ టమాటా వంద రూపాయలు పలుకుతోం ది. ఇది కనిష్ట ధర. గరిష్ట ధర ఏవిధంగా ఉందో ఊహించుకోండి.
మార్కెట్ ఎలా ఉంది.. మార్కెట్ శక్తులు ఎలా ఉన్నాయి. ఈ వాదనలోనూ ఈ వాదంలోనూ ఎప్పుడూ ఓడిపోయేది రైతు. ఎప్పుడూ గెలిచి నిలిచేది దళారీ. అవును! ఇందుకు నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. కానీ మార్కెట్ ను రైతుకు అనుగుణంగానో అనుకూలంగా నో మలిచే శక్తి ప్రభుత్వాలకు లేదు. లేదు గాక లేదు. అందుకే సేద్యగాళ్ల కోసం ప్రత్యేకించి చంద్రబాబు హయాంలో రైతు బజారులు పెట్టినా కూడా అవి మంచి ఫలితాలను ఇవ్వలేకపోయాయి. ఇప్పటికీ అక్కడ దళారులదే రాజ్యం. అధికారులకు అంతా తెలుసు కానీ ఏమీ తెలియని విధంగా ఉంటారు. అదేవిధంగా దళారుల హవాను అడ్డుకునేందుకు ఏపాటి చర్యలు తీసుకున్నా కూడా రాజకీయ జోక్యం కారణంగా అవి ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. దీంతో దళారుల హవా కారణంగా రైతు బజార్లలో రేట్లు చుక్కలు చూస్తున్నాయి. ఇదే కారణంతో టమాట, ఉల్లి మొదలగు వాటి ధరలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోగా, ధరలు పెరిగిన ప్రతిసారీ మార్కెట్ పై నిఘా పెంచకపోవడం, దళారీలను అడ్డుకోకపోవడం, కృత్రిమ కొరత సృష్టిస్తున్న వారిపై అధికారుల చర్యలు కూడా ఏమీ ఉండడం లేదు. ఇదే పరిణామ క్రమంలో ప్రభుత్వంపై విమర్శలు, వ్యంగోక్తులు (సెటైర్లు) పెరిగిపోతున్నాయి.