ప్రేక్షక టాలీవుడ్ : రాయల సీమ రామన్న చౌదరి ఎక్కడ?
నా రూటే వేరు అంటారు
ఇంకా ఏవేవో ఎన్నెన్నో
అనగలరు చెప్పగలరు
చెప్పించగలరు
ఆయనే గ్రేట్ గ్రేటెస్ట్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు
ఆయన తనని తాను చందమామతో పోల్చుకుంటూ పాట కూడా రాయించుకున్నారు. ఎంత మంచి వాడవయ్యా చందమామ నిన్ను చూసి పొంగిపోయె చదువులమ్మ అని! మరి! బోయవాని వేటుకు గాయపడిన కోయిల గురించి మోహన్ బాబు మాట్లాడాలి కదా! అవును కోయిల గురించి మాట్లాడకుండా ఉంటే ఎలా గాయాలు మాన్పకుంటే ఎలా?
సినిమాల్లో డైలాగులు బాగా చెబుతారు ఆయన. అన్న రామన్న స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోనూ రాణించానని చెబుతారు ఆయన. అదేవిధంగా తనకు కులం, మతం పట్టింపులు లేనేలేవని తానొక ఆదర్శవాదిని అని, ఆచరణ వాదినని చెబుతారు ఆయన..ఇన్నీ చెప్పిన ఆయన పొరుగున ఉన్న తమిళ నటుల మాదిరిగా తన బిడ్డలను ఎందుకు సహాయక చర్యలకు పంపలేకపోతున్నారు. తన బిడ్డలతో కష్టమో నష్టమో కొన్ని ప్రాంతాలకు అయినా పట్టెడన్నం పెట్టలేకపోతున్నారు. ఎందుకని సాటి మనిషి కన్నీరు తుడిచే ప్రయత్నమేదో చేయలేకపోతున్నారు. రాయల సీమ రామన్న చౌదరిని తానే నని చెప్పడంతోనే ఆయన బాధ్యత తీరిపోయిందా? అఫ్ కోర్స్ ఆ సినిమా పెద్దగా డబ్బులు తీసుకురాలేదు లేండి అది వేరే విషయం. అయినా కూడా ఆయన చిత్తూరు వాసి. సీమ నుంచి ఎదిగివచ్చిన నటుడు. శ్రీ విద్యా నికేతన్ పేరిట విద్యా సంస్థలు అక్కడే నెలకొల్పి నాలుగు రూపాయలు సంపాదించుకున్న వ్యక్తి. అలాంటి నటుడు ఇవాళ బాధ్యత మరిచి ఉండడం తగని పని!
అంతా మునిగిపోతున్నారు ఎవరో వచ్చి రక్షించాలి.. అంతా జల ప్రళయంలో చిక్కుకుపోతున్నారు ఎవరో వచ్చి కాపాడాలి. సాయం చేసే వాడే హీరో కదా! మరి! మన హీరోలు ఎక్కడ దాక్కున్నారు? ఎందుకని ఇటుగా రావడం లేదు. తన విద్యా సంస్థల ద్వారా ఎందరో పేదలకు ఉచితం చదవు చెప్పిస్తున్నానని చెప్పే మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు, మా అధ్యక్షుడు మంచి విష్ణు బాబు ఎక్కడ..? మాట్లాడితే చాలు జనం కోసం మేము మా కోసమే జనం అని చెప్పే మంచు కుటుంబం ఏమయిపోయింది.
ముఖ్యంగా అకాల వానల కారణంగా ఇవాళ సీమ ప్రాంతాలు చిత్తూరు వరదలతో అతలాకుతలం అయిపోయింది. దిగువ తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ కోలుకోలేకపోయాయి. అంతేకాదు ఇంకా వానలున్నాయి అన్న వార్తలు చిత్తూరును కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దిగువ తిరుపతిలో ఇప్పటికీ కూటికి గతిలేక సాయం కోసం అర్థిస్తున్నావారెందరో ఉన్నారు. కానీ వీళ్లెవ్వరూ మీకు కనపడరు.