పోటా పోటీ సంఘీ భావం : ఏ పార్టీ క్యాష్ చేసుకుంటుందో ?

న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటూ  తిరుమలకు పాదయాత్ర చేస్తున్న రైతులకు ఆదివారం ఊహించిన మద్దతు లభించింది.  నెల్లూరు జిల్లా కావలి నియోజక వర్గం కొత్త పల్లిగ్రామం వద్ద రైతు ఐకాస కు తెలుగుదేశం పార్టీ నేతలు తమ పార్టీ మద్దతు దారులతో వచ్చి సంఘీభావం తెలిపారు. తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు, నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ , ఉదయగిరి నియోజక వర్గం మాజీ శాసన సభ్యుడు బొల్లినేని రామారావు ఇతర నేతలు  పెద్ద సంఖ్యలో  పాదయాత్ర జరుగుతున్న ప్రాంతం వద్దకు వచ్చారు.  అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించారు. వారితో కలసి , వారి కండువాలు భుజాన వేసుకుని పాదయాత్రలో పాల్గోన్నారు. కావలి నియోజక వర్గానికే చెందిన తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యుడు బీద రవిచంద్ర యాదవ్ ఈ సంఘీభావ యాత్రకు హాజరు కాలేదు. వ్యక్తిగత పనుల వల్ల ఆయన హాజరు కాలేదని,  యాత్రలో తప్పకుండా పాల్పోంటారని తెలుగుదేశం పార్టీ శ్రేణలు వివరించాయి.  రైతుల యాత్రకు అన్ని వనరులూ సమకూరుస్తన్నది  తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణులే లనని  పాదయాత్రలో పాల్గోన్న కొందరు టిడిపి కార్యకర్తలు సూచన ప్రాయంగా వెల్లడించారు.  భారీ వర్షాల కారణంగా కొద్ది గా బ్రేక్ పడిన పాదయాత్ర ఆది వారం అత్యంత ఉత్సాహంగా ఆరంభమైంది.  అంత వరకూ బాగానే ఉంది. సీన్ కట్ చేస్తే
భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా ఆదివారమే రైతుల పాదయాత్రలో తమ  అడుగులు కలిపాయి. బిజే పి  సీనియర్ నేతలు రైతు ఐకాసా చేస్తున్న పాదయాత్రకు చేరుకున్నారు. వారికి తమ బహిరంగ మద్దతును ప్రకటించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ కేంద్ర మంత్రులు పురంధరేశ్వరి, సుజనా చౌదరి,  పార్లమెంట్ సభ్యుడు సి.ఎం. రమేష్, మాజీ రాష్ట్ర మంత్రులు రావెలకిషోర్ బాబు, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణ రెడ్డి తదితరులు విజయవాడ నుంచి నేరుగా  కావలి చేరుకున్నారు. రైతులతో సంభాషించారు. వారికి దారిపొడవునా... అంటే విజయవాడ- కావలి మధ్య మార్గంలో  బిజేపి శ్రేణులు స్వాగతం పలికారు. జై కిసాన్, జై జవాన్ అన్నది భారతీయ జనతా పార్టీ నినాదమని మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి ఈ సందర్భంగా తెలిపారు.  కేంద్రహోం మంత్రి అమిత్ షా నిర్ణయం మేరకు, ఆయన ఆదేశం మేరకు  భారతీయ జనతా పార్టీ  అమరావతి ఉద్యమానికి మద్దతు ఇస్తున్నదని ప్రకటించారు. అమరావతి రైతులకు అండగా కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జె.పి ప్రభుత్వం ఉంటుందని  పురంధరేశ్వరి ప్రకటించారు.  రాజ్య సభ సభ్యుడు సి.ఎం. రమేష్ తనదైన శైలిలో  రాష్ట్ర పోలీసుల తీరుపై విరుచుకు పడ్డారు. పోలీసుల ఆటలు సాగవని హెచ్చరించారు. పోలీసులు తమ పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఇలాగే ఉంటే తాము ఎంటర్ అవ్వాల్సి ఉస్తుందంటూ ఆవేశపూరిత ప్రసంగం చేశారు.  యాత్రకు సంఘీభావం తెలిపిన బిజెపి నేతలు దాదాపుగా అందరూ రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేసేందుకే తమ సమయాన్ని వెచ్చించారు.
 న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటూ పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు ఒకే రోజు రెండు ప్రధాన పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు. ఇక నుంచి పాదయాత్రలో  తమ పార్టీ శ్రేణులు  నేరుగా పాల్గోంటాయని కూడా ఆ పార్టీలు రైతు ఐకాస కు వివరించాయి. నెల్లురు జిల్లా లో బి.జె.పి, టిడిపి కి ప్రజల్లో ఉన్న గ్రాఫ్ పడిపోయిందని ఇటీవలి  ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి.  రాజకీయ పక్షాల నేతలు కేవలం సంఘీభావం మాత్రమే ప్రకటించి మిన్నకుండి పోతారా ? ఇక మిలిన యాత్రలో ఐకాస తో కలసి అడుగులు వేస్తారా ? అన్నది వేచి చూడాలి. ఈ ఉద్యమాన్ని క్షేత్ర స్థాయిలో ఎవరు తమకు అనుకూలంగా మలచు కుంటారన్నది ఆసక్తి కరమైన అంశం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: