జగన్ బాబులాట - ఆంధ్రప్రజ నోట్లో పెండ: గూడూరు గోడు వినండయ్యా
వ్యవసాయ పరంగా ఈ ప్రాంతం ప్రస్తుతం నిమ్మకాయలకు ఎగుమతి కేంద్రం గా ఉంది. ఇక్కడి నుంచి ఉత్తర భారత దేశానికి నిమ్మకాయలు నిత్యం ఎగుమతి అవుతాయి. రైళ్లు, లారీలు, తిరుపతి, చెన్నై విమానాశ్రయాల నుంచి కూడా ఇక్కడి వ్యాపారులు నిమ్మకాయలను ఎగుమతి చేస్తారు.
రాజకీయ పరంగా ఉద్దండుల స్వక్షేతం. దివంగత నేతలు మాజీ ముఖ్యమంత్రి నేదురు మల్లి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి నల్లపు రెడ్డి శ్రీనివాసులరెడ్డిల బర్త్ ప్లేస్. ఇద్దరూ వేర్వేరు పార్టీ లో ఉన్నా, ఓకే పార్టీలో ఉన్నాకూడా విభిన్న దృవాలు గానే వ్యవహరించారు. ప్రస్తతం తరం మారింది. కొత్త నేతలు పుట్టుకు వచ్చారు. వారి స్వరం మారింది. అసెంబ్లీ లోనూ, బైట కూడా రాజకీయ నేతల తీరు మారింది.
నెల్లూరు జిల్లా వరి సాగుకు పెట్టింది పేరు. నెల్లూరు మొలగొలుకులంటే తెలియని తెలుగోడు ఉండడంటే అతిశయోక్తి లేదు.
పక్షం రోజులుగా ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కర్షకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో రైతులకు ఏ కొద్ది పాటి ఇబ్బంది వచ్చినా అధికారులు, రాజకీయ నేతలు ఎలాంటి హడావిడి లేకుండా వచ్చి అండగా నిలబడే వారు. ప్రస్తుతం రాజకీయ నేతల తీరు మారింది. ఇటీవలి వర్షానికి ఒక్క గూడూరు డివిజన్ లోనే 75 వేల ఎకరాలకు పైగా వరి పంటకు నష్టం వాటిల్లింది. ఐదువేల ఎకరాలకు పైగా మినుము పంట నీట మునిగింది వెయ్యి ఎకరాల్లో వేరు శనగ , పది వేలకు పైగా ఎకరాల్లో నిమ్మ పంటలు దెబ్బ తిన్నాయి. ఆక్వా రంగానికి జరిగిన నష్టం వివరాలు ఇంకా తెలియ రాలేదు. రైతుల గోడు పట్టించుకునే నాథుడే కరవయ్యారు.
ఇదే సమయంలో అమరావతిలో అసెంబ్లీ సమావేశం.. పైగా వ్యవసాయం పై చర్చ. రైతులందరూ ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశించారు. ప్రతిపక్ష సభ్యులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారని రైతులు భావించారు. కానీ జరిగిందేమిటి ? ప్రజల సమస్యలను చర్చించాల్సిన నేతలు అక్కడ ఏం చేశారు ? జగన్ బాబులాట - ఆంధ్రప్రజ నోట్లో పెండ... ఇదా ప్రజాప్రతినిధులు చేయాల్సింది.