టీజింగ్ పాలిటిక్స్ : పిల్లాడయిన జగన్ పెద్దాడయ్యాడు ఆహా!
చాలా రోజులకు పురివిప్పిన పగలూ, జడలు విప్పిన ప్రతీకారాలూ చూశాను. విన్నాను. నవ్వుకున్నాను. మంచిదే ఇలాంటివి ఉండడం వల్ల ప్రత్యర్థులు బాగా పనిచేస్తారు. లేదా బాగా పనిచేయాలన్న స్ఫూర్తితో ఉంటారు. ఆ స్ఫూర్తిలో భాగంగానే ఒకరినొకరు తిట్టుకోవడంలోనో లేదా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకోవడంలోనూ చాలా చాలా బిజీ గా ఉంటారు. ఇలాంటి చర్యల వలనే ప్రజా స్వామ్యం బతికే ఉంటుంది అన్న స్పృహ ఒకటి వెలుగులోకి వస్తుంది. లేదా ఇంకా ప్రజా స్వామ్యం చీకటిలోనే ఉందని భావించాలి.
అసెంబ్లీలో మీడియా పాయింట్ తో పాటు టీజింగ్ పాయింట్ కూడా పెడితే బాగుండు అండి. ఎందుకంటే రోజూ తిట్టుకోవడానికి రోజూ ఒకరినొకరు దెప్పి పొడుచుకోవడానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది కూడా! ఆ విధంగా ముందుకువెళ్లేందుకు మరియు వెనక్కు మళ్లేందుకు ఇలాంటి పాయింట్లన్నవి ఎంతగానో ఉపయోగపడాలి కూడా! లేకపోతే ప్రజాస్వామ్యం డల్ అయిపోతుంది. అందుకే అసెంబ్లీలో మీడియా పాయింట్ తో పాటు టీజింగ్ పాయింట్ కూడా ఉండాలి అని కోరుకోవడంలో తప్పేం లేదు. నిన్నటి వేళ చంద్రబాబును జగన్ మనుషులు టీజ్ చేసినా, అప్పుడెప్పుడో పాత కోపాల దృష్ట్యా టీడీపీ పై దండయాత్ర చేసినా ఇవన్నీ కూడా ప్రజా స్వామ్య స్ఫూర్తిగా విఘాతం అని అనకూడదు. ఎందుకంటే అది తప్పు. మన జీవితాల్లో లేనివి ఉన్నవి అన్నీ కూడా మంచికి సంకేతాలు కావు కదా! కొన్ని చెడుకు కొన్ని మంచికి తార్కాణాలు అయి ఉన్నాయి. కనుక మనం ఏం చేసినా అదంతా మన మంచికే అని అనుకోవడం మంచి ఉద్దేశాలకు ఉదాహరణలుగా నిలిచి ఉంటాయి.