కోస్తాకు ముప్పు తప్పింది.. గోదావరి మునుగుతోంది..
వాయుగుండం తీరం దాటినా.. ఆ ప్రభావంతో గోదావరి జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలకు వాయుగుండం తోడవడంతో వర్షాలు అదుపు లేకుండా కురుస్తున్నాయి. దీంతో గోదావరి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరితో పాటూ రాజమండ్రిలోని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. విశాఖనగరంలోనూ వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. విశాఖతోపాటు విజయనగరం జిల్లాలోకూడా భారీగా వర్షం కురుస్తోంది.
శ్రీకాకుళం జిల్లాలో కూడా వాయుగుండం ప్రభావం కనిపించింది. వీటితో పాటూ ప్రకాశం జిల్లాలోనూ వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాలో రైతులు నష్టపోయారు. వందలాది ఎకరాల్లో వేసిన వరిపైరు నీట మునిగింది. మినుము పంటకు నష్టం వాటిల్లింది. ఈ వర్షాలు మరో నాలుగు రోజులు ఇలాగే కొనసాగితే వేసిన పంట నాశనం అవుతుందని అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. నిన్నటివరకూ చిత్తూరు, నెల్లూరు జిల్లాలను వణికించిన భారీవర్షాలు, ఇప్పుడు గోదావరిజిల్లాలపై పగబట్టినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలాగ్రామాలు జలదిగ్భంధంలో ఉండగా, ఇప్పుడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందనే వార్తలతో జనం వణికిపోతున్నారు. కొత్తగా ఏర్పడే అల్పపీడనం ప్రభావం ఈనెల 17నుంచి కనిపిస్తుందని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. అయితే దాని ప్రభావం దక్షిణ కోస్తాపై ఎక్కువగా ఉంటుందా, లేక ఉత్తరాంధ్రవైపు వెళ్తుందా అనేది వేచి చూడాలి.