టీఆర్‌ఎస్ Vs బీజేపీ : రైస్ ఛాలెంజ్..?
వర్షాకాలంలో వేసిన వరి పంటనే కొనుగోలు చేస్తామని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. యాసంగి పంటకు సంబంధించి తేమ సమస్య ఉందని.. బాయిల్డ్ రైస్ ను కేంద్రం కొనట్లేదని.. అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరణ ఇచ్చారు. అయితే.. విత్తన కంపెనీలతో అవగాహన ఉన్నవారు మాత్రం వేసవిలోనూ వరి పండించుకోవచ్చన్నారు మంత్రి. అలాగే మిల్లర్లతో ఒప్పందం ఉన్నవారు కూడా వరి పంట వేసుకోవచ్చని వివరణ ఇచ్చారు.
మిగిలిన రైతులు వేసంగిలో ఇతర పైర్లు వేసుకోవాలని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. కేంద్రం వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయవలసి ఉందని, కాని ప్రభుత్వం నిరాకరిస్తోందని ఆయన చెప్పారు. తెలంగాణలో వ్యవసాయరంగాన్ని, సాగునీటి రంగాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుకు తీసుకు వెళుతున్నారని నిరంజన్ రెడ్డి చెప్పారు. అయితే మంత్రి ప్రకటనపై బీజేపీ మండిపడుతోంది. రైతులు ఏ పంట వేయాలో ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంకో అడుగు ముందుకేశారు. వేసవిలో రైతులు వరి మాత్రమే సాగు చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఎలా మీ పంట కొనదో బీజేపీ చూస్తుందని సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రభుత్వం పంటకొనకపోతే.. మెడలు వంచి మరీ కొనిపిస్తామంటున్నారు బండి సంజయ్. ఈ సవాళ్లు బాగానే ఉన్నాయి.. తీరా పంట కొనిపించలేకపోతే.. అప్పుడు బీజేపీ కేంద్రంతో కొనిపిస్తుందా.. లేక రైతులను నట్టేట ముంచేస్తుందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.