బాబోరి రేవంత్ : గాంధీ భవన్ రాజకీయాల్లో కీలక మార్పు?
ఇక తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ ను పూర్తి స్థాయి నాయకుడిగా చూసేందుకు ఆ పార్టీ పెద్దలు కూడా పెద్దగా ఇష్టపడకపోవచ్చు. హుజురాబాద్ ఫలితం తరువాత కూడా ఆయనను సీనియర్లు నమ్మారు అంటే ఆశ్చర్యకరమే! అలా అయితే ఇకపై వచ్చే ప్రతి స మస్యకూ ఏదో ఒక కారణం వెతికి తీరాలి. ఆ కారణం ఆయన తప్ప మరెవ్వరయినా కానీ ఆయనే ఓ పెద్ద తలనొప్పి అన్నదే ప్రధాన ఆరోపణ. అందుకే రాత్రి కి రాత్రి గాంధీ భవన్ రాజకీయాలు మారిపోవు అని చెప్పేది..గొంతు చించుకుని అరిచేది కూడా! అరచేతిలో స్వర్గం చూపిస్తామన్నా కూడా ప్రజలు ఇవాళ కాంగ్రెస్ నాయకులను నమ్మేలా లేరు. అలాంటప్పుడు రేవంత్ లాంటి బలహీనమైన నాయకత్వాన్ని ఎలా స్వాగతిస్తారని?
రేవంత్ వచ్చాకే కౌశిక్ రెడ్డి తన దారి తాను చూసుకున్నాడు. ఈ విషయమై ఆయన పొరపాట్లు ఉన్నా కూడా కొంతలో కొంత కౌశిక్ కాంగ్రెస్ లో ఉంటే బాగుండేదే! హుజురాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన ఉంటే కనీసం గౌరవనీయమైన ఓటమి అయినా
దక్కేది. అంతేకాదు రేవంత్ వచ్చాకే చాలా మంది మళ్లీ సైలెంట్ అయిపోయేందుకు సిద్ధం అయిపోతున్నారు. సీనియర్లు కూడా
ఆయనను గెలుపు గుర్రంగా చూడడం లేదు. ఆ రోజు పార్టీ కోసం పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ లాంటి మహానేతతో రేవంత్ ను పోల్చలేం. ఆ పాటి సాహసం కానీ నిర్ణయాల అమలులో వేగంగా కానీ రేవంత్ లో లేవు గాక లేవు. పైగా ఆయన ఎన్ని కాదన్నా ఎవరు కాదన్నా వైఎస్ వ్యతిరేకి. ఇప్పటికీ తెలంగాణ వాకిట ఉన్న వైఎస్ అభిమానులకు ఆయనంటే గిట్టదు. గాంధీ భవన్ వాస్తును మార్చినంత ఈజీ కూడా కాదు వైఎస్ అభిమానుల మనసులను మార్చడం మరియు గెలుచుకోవడం. ఇవన్నీ రేవంత్ కు ఇవాళ మైనస్ కానున్నాయి. త్వరలో టీపీసీసీ చీఫ్ మారిపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!