కేసీఆర్ Vs ఈటెల : ముందే కూసిన కోయిల షర్మిల ? ఎందుకంటే?
హుజురాబాద్ ఎన్నికల తరువాత కొన్ని విశ్లేషణలు విస్మయ పరుస్తున్నాయి. ఇది ఈటెలకు అనుకూలంగాఉన్న ఫలితం అయినప్పటికీ ఇందుకు గులాబీ దండు ఎంతగానో సహకరించింది అన్నది ఓ బహిరంగ విమర్శ. మరో విమర్శ ఏంటంటే కేసీఆర్ కు చెందిన మనుషులు కూడా ఈటెలకు సాయం చేశారని..! ఇవి ఎలా ఉన్నా అభ్యర్థి ఎవ్వరైనా సరే రెండు జాతీయ పార్టీలూ ఈటెలకే కొమ్ముకాశాయి అని..ఇంకా చెప్పాలంటే వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిల చెప్పిన విధంగా కేసీఆర్ కు అనుబంధంగానే రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి. ఆ విధంగానే అవి తమ నడవడి సాగించాయి. గెల్లు శీను ఓడిపోవడంలో కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది. అందుకు రేవంత్ రెడ్డి సహకారంపైనే అనుమానాలు బాగా ఉంటున్నాయి. అదేవిధంగా బీజేపీకి బాసటగా నిలిచిన శక్తులు అన్నీ కూడా కేసీఆర్ మనుషులే కనుక..ఈటెల గెలవడం అన్నది కేసీఆర్ గెలవడం లాంటిదే అని తేలిపోయింది. ఇప్పుడు కేసీఆర్ రెండు జాతీయ పార్టీలతోనూ ఎందుకు సఖ్యతగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సొంత పార్టీ అభ్యర్థి గెలుపు పై పైకి మాట్లాడినా కూడా పార్టీలో హరీశ్ రావు హవాను చెక్ పెట్టేందుకే ఆయన నడిపిన ఈ నాటకంలో కాంగ్రెస్ మరియు బీజేపీ పావులుగా మారి ఈ చదరంగంలో విజేతగా ఈటెలను నిలిపాయి.
వాస్తవానికి గెల్లు గెలిచినా ఓడినా ఒక్కటే ఎందుకంటే.. నాయకత్వం అంతా హరీశ్ రావే చూసుకుంటారు కనుక. పేద కుటుంబం నుంచి వచ్చిన గెల్లు శ్రీను పై ఇప్పుడు సానుభూతి వ్యక్తం అవుతుందంటే కారణం కేవలం ఆయన వ్యక్తిగత నేపథ్యం మరియు నడవడి. ఈటెలను నడిపించిన కేసీఆర్ ఇప్పుడు గెల్లును అదేవిధంగా నడిపిస్తారా.. ఉప ఎన్నికల్లోనూ తానే అన్నీ అయి నడిచిన హరీశ్ రావు ఇకపై అదే హవాతో పార్టీలో ఉండగలరా? ఈటెల కేవలం పార్టీని మాత్రమే విడిచివెళ్లారు. క్యాడర్ ను కాదు. క్యాడర్ ను అక్కడే ఉంచి తనకు అనుగుణంగా పనిచేయించుకున్న ఘటన కానీ ఘనత కానీ ఈటెల సొంతం. ఎలా చూసుకున్నా కేసీఆర్ వ్యూహంలో రెండు జాతీయ పార్టీలు తమ పని తాము చేసుకుని పోయి ఈటెలను విజేతగా నిలిపి, షర్మిల చెప్పిన మాటను నిజం చేశాయి. ఆమె చెప్పిన విధంగా ఆ రెండు పార్టీలూ టీఆర్ఎస్ గూటి పక్షులే అని తేలిపోయింది. ఇప్పుడు హరీశ్ రావు ను ఇంటికి పంపడమే కేసీఆర్ ముందున్న తక్షణ లక్ష్యం.