కేసీఆర్ Vs ఈటెల : అతడు హుజురాబాద్ ను జయించాడ్రా!
రాజకీయం అంధకారాన్ని ఇస్తుందని విన్నాను. కానీ ఈ సారి వెలుగులే ప్రసాదించింది. తనను నమ్ముకున్న ప్రజలకు మరోసారి తన నాయకత్వంకు ఉన్న అవసరం ఏంటో చాటి చెప్పింది. ఈటెల గెలిచాడ్రా! తెలంగాణ బాహుబలి వీడేరా! అరేయ్ కట్టప్పా! నువ్వు సైడ్ అయిపో! అంతే! ఇదే మాట ఇప్పుడు అహంకారంతో చెప్పవచ్చు తప్పేం లేదు. ఆ పాటి పొగరు ఉండాలి. దానినే విజయ గర్వం అని అంటార్రా! ఇంకేం ఈటెల నీ పాలన నువ్వు సాగించు. దూసుకుపో! ఆల్ ద బెస్ట్ రా అన్నా! హరీశ్ సర్ మీరు బాధపడకండి..ఇన్నీ ఇవన్నీ రాజకీయాల్లో చాలా చిన్నవి. మీరు మీ కెరియర్ ను జాగ్రత్తగా చూస్కోండి. ఆల్ ద బెస్ట్ టు యూ!
అహంకారమో ఆత్మగౌరవమో ఏదో ఒకటి నెగ్గనీ! అలా నెగ్గిన ప్రతిచోటా ఎవరో ఒకరు ఏదో ఒకటి నేర్చుకోని! హుజురాబాద్ ఫలితంతో కేసీఆర్ ఉన్నపళాన జ్ఞాన చక్షువులతో లోకాన్ని చూస్తాడని అనుకోలేం. ఇవాళ తెలంగాణ ముఖ చిత్రం ఉన్నట్లుండి మారిపోదు. కష్టాలా నష్టాలా ఏవో ఒకటి ప్రజలను వెన్నాడుతూనే ఉంటాయి. ఇంకేం కావాలి ఇంకేం చేయాలి? మరో ఉప ఎన్నికకు మనం సిద్ధం కాలేమా కేసీఆర్.. ఎందుకయ్యా మీరూ మీరూ కొట్టుకుని మమ్మల్ని బలి పశువులు చేస్తారు. ఎందుకయ్యా మీరు మీరు తన్నుకుని జనాలకు విలువైన సాయం ఏదీ అందనీయక చేస్తారు. ఈ ఎన్నికల నుంచి మీరు సాధించిందేంటి? ఈ ఎన్నికలే ఏ ఎన్నికలు కూడా ప్రజా ఆకాంక్షలను నేరుగా నెరవేరుస్తాయని అనుకోలేం. ఏవీ ప్రజల ఇబ్బందులను పరిష్కరిస్తాయనీ చెప్పలేం. కానీ ఎవరో ఒకరు వస్తారన్న ఆశ మనుషుల్లో చావనంత వరకూ చావనీయనంత వరకూ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అత్యంత పద్ధతిగా ప్రజా స్వామ్య వ్యవస్థను కాపాడుతూనే ఉంటాయి. సో.. గెలిచిన ఈటెలకు కంగ్రాట్స్ ఓడిన గెల్లుకు కూడా కంగ్రాట్సే!
1200 కోట్లు ఖర్చు చేయాలని, ఆ ఖర్చును దళిత బంధు పథకానికే ఖర్చు చేయాలని తలపోశాడు కేసీఆర్. కానీ తరువాత పథకం అమలులో మంచి నిర్ణయాలు అమలు చేసేలా కలెక్టర్లను ఆదేశించాడు. దీంతో రాత్రికి రాత్రి లబ్ధిదారుల అకౌంట్లన్నీ ఫ్రీజ్ అయిపోయాయి. డబ్బులిచ్చి ఏం సుఖం వాటిని ఖర్చు చేయకూడదని చెప్పాక అంటూ పెదవి విరిచారు దళితులు. పోనీ ఆయన నమ్ముకున్న రెడ్లన్నా ఆయన వైపు ఉన్నారా అంటే అదీ సందేహమే! బాగుంది కులాలను నమ్ముకోవడం కన్నా అభివృద్ధిని నమ్ముకోవడం నేర్చుకుంటే మేలేమో కేసీఆర్. పోనీ ఇతర పార్టీల నుంచి వచ్చిన కౌశిక్ రెడ్డి, మోత్కుపల్లితో సహా ఇతర నేతలు ఏమయినా సాయం చేశార్రా అంటే అదీ లేదు. కౌశిక్ రెడ్డి తన వంతుగా ఓట్లను ఈటెలకు వేయించాడని టాక్. ఆ విధంగా తమ అధినేత ను మోసం చేశాడని గులాబీ శ్రేణులు అంటున్నారని కూడా టాక్. ఇప్పుడేం చేస్తారు?
ఇదే సందర్భంలో రేవంత్ ఫ్యాక్టర్ అస్సలు పనిచేయలే! ఇంకా ఇతర ఫ్యాక్టర్లు కూడా పనిచేయలే! బండి సంజయ్ నడవలేక నడిచాడు. ఇప్పుడు తనదే విజయం అని విర్రవీగుతాడేంటో! ఏ మాటకు ఆ మాట పోల్ మేనేజ్మెంట్ లోనూ, ఫ్లోర్ మేనేజ్మెంట్ లోనూ ఈటెల సాధించిన విజయమే ఈ విజయం. ఆయన అనుచరుల అప్రమత్తత కారణంగానే ఆయనకు దక్కిందీ విజయం. నో డౌట్ .. పనికిమాలిన పనులు అధికార పార్టీ ఎన్ని చేసినా ఈటెల వాటిని నిలువరించాడు. ఎదురుగా ఎన్నో శక్తులు వచ్చి అడ్డగిస్తే వాటినన్నింటినీ కాదన్నాడు. తొక్కి పెట్టాడు. తొక్కి నార తీసి కేసీఆర్ కు సవాలు విసిరాడు. ఒకనాటి స్నేహం అంతా మరిచిపోయి హరీశ్ రావు వాగిన వాగుడు, విర్రవీగుడు చూసి నవ్వుకుని ఇప్పుడు వీరుడు తానేనని తనని తాను నిరూపించుకున్నాడు. అదే మాట ఓటరన్నతోనూ అనిపించాడు. సెబ్బాష్ రా ఈటెల! శుభాకాంక్షలతో..
- రత్నకిశోర్ శంభుమహంతి