ఆంధ్రాకు కాపు ముఖ్యమంత్రి.. ఆ రెండు కులాలకు చెక్..!
కాపులు ఎప్పటి నుంచో తమకు రాజ్యధి కారం కావాలని పోరాటాలు చేస్తున్నారు. ఈ వర్గానికి చెందిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. చివరకు ఆయనే ఎమ్మెల్యే గా గెలవలేదు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు. ఆయన రెండు చోట్ల పోటీ చేసినా ఎమ్మెల్యే గా గెలవలేదు. అయితే ఇప్పుడు ఆ వర్గానికి వచ్చే ఎన్నికల్లో అయినా రాజ్యాధి కారం రావాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇదే అంశంపై కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్ చింతా మోహన్ మాట్లాడారు. 2024లో కాపు కులస్తుడే ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని చెప్పిన ఆయన... రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న 80 శాతానికి పైగా ప్రజలకు ఇప్పటి వరకు ఎందుకు రాజ్యాధికారం రాలేదని సూటిగా ప్రశ్న వేశారు. 3 శాతం ఉన్న రెడ్లు 45 ఏళ్లు - 3 శాతం ఉన్న కమ్మ కులస్తులు 25 సంవత్సరాలు పరిపాలించారని ఆయన అన్నారు.
ఇక ఇప్పుడు ఏపీ లో తూర్పు కాపులు - బలిజలు - కాపులు ఇలా దాదాపు కోటి మంది ఉన్నారని ... మిగిలిన ఎన్ని పదవులు వచ్చినా ఉపయోగం లేదని.. రాజ్యధి కారం అంటే కేవలం ముఖ్యమంత్రి పదవి మాత్రమేనని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. 2024లో ఈ ముఖ్యమంత్రి పదవి కాపులకు వచ్చేలా చేస్తామని.. ఇందుకోసం సెక్యులర్ పార్టీలు అన్నింటితో మాట్లాడతామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.